Share News

కొండా సుస్మితకు సంస్కారం నేర్పండి

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:17 AM

సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సుస్మిత, ఆమె తల్లి- రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్‌ నాయకులు ధ్వజమెత్తారు.

కొండా సుస్మితకు సంస్కారం నేర్పండి

  • కొండా దంపతులకు కాంగ్రెస్‌ నేతల హితవు

  • పదవి ఇచ్చిన సీఎంపైనే అనుచిత వ్యాఖ్యలా..?

  • కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే

  • అధిష్ఠానానికి ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు స్వర్ణ విజ్ఞప్తి

హనుమకొండ సిటీ/ హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సుస్మిత, ఆమె తల్లి- రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్‌ నాయకులు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, తదితరులతో కలిసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సంస్కారం లేని సుస్మితకు మర్యాద, సంస్కారం నేర్పాలని కొండా దంపతులకు హితవు చెప్పారు. తల్లి సురేఖకు మంత్రి పదవి ఇస్తే కృతజ్ఞత చూపడానికి బదులు సీఎంపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు. పదవి ఇచ్చిన వారిపైకి ఉసిగొల్పడం సరి కాదన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. స్థాయి మరిచి సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్‌ రెడ్డి బాధ్యతతో పార్టీని గెలిపిస్తే.. అందుకు అధికారంలోని పదేళ్లలో ఎన్నో బాధలు అనుభవించిన కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసిన స్వర్ణ.. ఈ తరుణంలో సుస్మిత వ్యాఖ్యలు అందరిని కలవరానికి గురి చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు.


పార్టీలు మారిన ఘనత కొండా దంపతులదేనన్న స్వర్ణ.. టీడీపీ.. కాంగ్రెస్‌, వైఎస్ఆర్‌సీపీ.. కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌.. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చినా, సీఎం రేవంత్‌ రెడ్డి గౌరవంతో ఆమెకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. అడగ్గానే ఇవ్వడానికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఏమైనా చాక్లెటా, బిస్కెటా అని ప్రశ్నించారు. ప్రతీసారీ బీసీ కార్డు ప్రయోగించడం కొండా దంపతులకు పరిపాటేందన్న బస్వరాజు.. తామంతా బీసీలుగా పార్టీలో కొనసాగడం లేదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ.. సుస్మిత మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్‌ నేతలపైనా చర్య తీసుకోవాలన్నారు.


బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు కుదరవు

కాంగ్రెస్‌ పార్టీలో బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు కుదరని ఆ పార్టీ మహిళా నేతలు పలువురు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న కొండా సుస్మిత ఏనాడైనా గాంధీ భవన్‌ మెట్లెక్కిందా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ మహిళా సీనియర్‌ నేతలు కాల్వ సుజాత, ఇందిరా శోభన్‌, వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ గుంజా రేణుక, హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ జక్కని అనిత గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంకా పటేల్‌, పట్వారీ వ్యవస్థ ఉందని ఆమె అనుకుంటుందా? అని ప్రశ్నించారు. సుష్మిత ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 06:18 AM