Share News

ఆమె రాజీనామా చేయాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:25 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై.. తొలిసారిగా ఓ మంత్రి స్పందించారు. కూతురు చేసిన అనుచిత వ్యాఖ్యలకు..

ఆమె రాజీనామా చేయాలి

  • కూతురి వ్యాఖ్యలతో సంబంధం లేదనడం సరికాదు

  • మంత్రి అడ్లూరి వ్యాఖ్యలు

ఉట్నూర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై.. తొలిసారిగా ఓ మంత్రి స్పందించారు. కూతురు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహించి కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ అనడం సరికాదన్నారు. శనివారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడానికి రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. తమకు రాజకీయ వారసత్వం లేకపోయినా రేవంత్‌రెడ్డి చలువతో శాసనసభకు ఎన్నికయ్యామన్నారు. తన చెల్లెలు లాంటి కొండా సురేఖ ఇప్పటికైనా తప్పు తెలుసుకుని, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని సూచించారు. మంత్రివర్గం నుంచి ఆమె గౌరవంగా తప్పుకొంటే బాగుంటుందన్నారు. దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం దొరల పాలనలో ఉందని, అందుకే ఐటీడీఏ నిర్వీర్యమయిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాను, అధికారులు కలిసి డిసెంబరు 30లోగా ఐటీడీఏలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 05:26 AM