గీత దాటితే వేటే.. కూతురి వ్యాఖ్యల్ని సురేఖ ఖండించాల్సింది: మల్లు రవి
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:30 AM
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు.
మంత్రిగా సురేఖ తన కూతురి వ్యాఖ్యల్ని ఖండించాల్సింది
చిన్నారెడ్డి వ్యాఖ్యల వీడియోలనూ చూశాం
మేఘారెడ్డి వివరణ తీసుకుంటాం
రాజగోపాల్‌రెడ్డి విషయంలో నిబంధనల ప్రకారం వెళతాం: మల్లు రవి
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. సుదీర్ఘ సమావేశం అనంతరం ఆ వివరాలను మల్లు రవి మీడియాకు వెల్లడించారు. మంత్రి కొండా సురేఖకు జారీ చేసిన నోటీసులకు ఆమె ఇచ్చిన లిఖితపూర్వక వివరణను క్రమశిక్షణ కమిటీ పరిశీలించిందని తెలిపారు. మంత్రి కూతురు కొండా సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒక సాదారణ వ్యక్తిగా సంబోధిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను కమిటీ పూర్తిస్థాయిలో విశ్లేషించిందన్నారు. ఒక మంత్రిగా తన కూతురి వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాల్సిందని, కానీ.. సహజ న్యాయసూత్రాల ప్రకారం తనకు సంబంధం లేదనడం సరైంది కాదని మల్లు రవి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో కొందరు ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులను క్రోడీకరించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికిప్పుడు చర్యల సమయాన్ని వెల్లడించలేమన్నారు.
చిన్నారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాలపై..
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను క్రమశిక్షణ కమిటీ పరిశీలించిందని మల్లు రవి తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు చిన్నారెడ్డి సమర్పించిన వివరణనూ విశ్లేషించామన్నారు. స్పష్టత కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డిని మరోసారి పిలిచి వివరణ తీసుకుంటామని చెప్పారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల విషయంలో తమకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదన్నారు. ఆయన విషయాన్ని సుమోటోగా స్వీకరించాలా? వద్దా? అనే కోణంలో నిబంధనల ప్రకారం ముందుకెళతామని అన్నారు. ఇక ఎల్‌బీనగర్‌కు చెందిన జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించినందుకుగాను ఆయనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లు మల్లు రవి అధికారికంగా ప్రకటించారు. సస్పెన్షన్ ప్రకటన తర్వాత కూడా ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో గాంధీభవన్‌కు వచ్చి గొడవకు దిగడం, సీనియర్ నేత మధుయాష్కిగౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరోవైపు ఆదిలాబాద్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో కంది శ్రీనివా్‌సరెడ్డి, సంజీవరెడ్డి మధ్య జరిగిన వివాదంపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వద్ద కూడా వివరాలు సేకరించామని చెప్పారు. అలాగే సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య విభేదాలపై వివరణ కోరినట్లు వెల్లడించారు.