ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం!
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:19 AM
తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక అదృశ్య వ్యక్తుల హస్తం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు.
గుర్తించి చర్యలు తీసుకోండి
షోకాజ్ నోటీసుకు ఇప్పటికే జవాబిచ్చా
ఐనా అవమానిస్తూ మాట్లాడుతున్నారు
వారిని ప్రేరేపిస్తూ.. నిర్దిష్ట లక్ష్యాలతో మాట్లాడిస్తున్నారు
క్రమశిక్షణ కమిటీకి సురేఖ మరో లేఖ
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక అదృశ్య వ్యక్తుల హస్తం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి శనివారం ఆమె లేఖ రాశారు. ‘నేను పార్టీపై, పార్టీ నియమావళిపై పూర్తి గౌరవాన్ని స్పష్టంగా ప్రకటించాను. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించా. అయినా.. నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు సీఎల్పీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నాయకులు బహిరంగంగా, అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరో వారిని ప్రేరేపిస్తూ, నిర్దేశిస్తూ, ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారనే అనుమానం కలిగేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. దీని వెనుక అదృశ్యహస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులెవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ఎదుట డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని, కానీ.. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలిపై సామూహికంగా మాటల దాడి జరుగుతున్నా పార్టీనాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.