Share News

సాగనంపాల్సిందే!

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:15 AM

మంత్రి కొండా సురేఖ వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం స్వయంగా రంగంలోకి దిగింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిణామం సరికాదని భావిస్తున్న అధిష్ఠానం..

సాగనంపాల్సిందే!

  • మంత్రి కొండా సురేఖపై మెజారిటీ నేతల పట్టు

  • రంగంలోకి అధిష్ఠానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్‌

  • ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ

  • భట్టి, మహేశ్‌, రవి, వేంనరేందర్‌ల మధ్య చర్చలు

  • భట్టిని కలిసేందుకు కొండా మురళి యత్నం

  • అవకాశం ఇవ్వని డిప్యూటీ

  • విచారణ సమయంలో నాపై విమర్శలేల?

  • క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ ఘాటు లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం స్వయంగా రంగంలోకి దిగింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిణామం సరికాదని భావిస్తున్న అధిష్ఠానం ఈ రగడకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనన్న అభిప్రాయంతో ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. వివాదానికి ముగింపు పలికే చర్యలు తీసుకోవడంతో పాటు తదుపరి కార్యాచరణ ప్రణాళిక పైనా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అభిప్రాయాలు తీసుకునే బాధ్యతను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అప్పగించింది. ఆమెతో పాటు సహాయకులు శనివారం రాష్ట్రంలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో మాట్లాడి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని అత్యధికులు చెప్పారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. సుస్మితకు-ప్రభుత్వానికి మధ్య వైరంలా కాకుండా ముఖ్యమంత్రి-మంత్రికి, పార్టీకి-పార్టీ నేతకు మధ్య రగడలా ఈ పరిణామం రూపుదిద్దుకుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ‘‘శుక్రవారం 17 మంది, శనివారం మరో 10 మందికి పైగా బాహాటంగా మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఒక విధంగా బాణం వదిలేసినట్లే.


ఇప్పుడు వెనక్కి తీసుకుంటే పార్టీలో క్రమశిక్షణ అన్న దానికి అర్థమే ఉండదు. రేపు కొండా సురేఖ మంత్రివర్గంలో కొనసాగితే ఈ 27 మంది ఎమ్మెల్యేలు ఆమె దగ్గరకు వెళ్లలేరు. ఆమె కూడా ఒక మంత్రిగా వారందరినీ కలిసే పరిస్థితి ఉండదు. దీనికి ముగింపు పలకాల్సిందే’’ అని మీనాక్షి నటరాజన్‌కు రాష్ట్ర పార్టీ నేతలు చెప్పినట్లు సమాచారం. ‘‘కొండా సురేఖ కూడా అమీ తుమీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణలో తన కుమార్తె వ్యాఖ్యల పట్ల ఎలాంటి విచారాన్ని వ్యక్తం చేయకపోగా తాజాగా మళ్లీ రెండో లేఖ కూడా రాశారు. ఆ లేఖలోనూ లెక్క చేసేదేం లేదు అన్నట్లుగానే ఆమె వైఖరి ఉంది. ఈసారి అధిష్ఠానం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటుంది’’ అని మరికొందరు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.


వరుస భేటీలు...అంతర్గత చర్చలు

కొండా వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిలు విడివిడిగా అనేక మందితో మాట్లాడారు. భట్టి-వేంనరేందర్‌రెడ్డిలు కూడా ఈ అంశంపై చర్చించుకున్నారని సమాచారం. శుక్రవారం 17 మంది ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించి కొండా సురేఖపై వేటు వేయాలని డిమాండ్‌ చేయగా తాజాగా మరో 10 మంది అదే కోరారు. కొండా సురేఖ కూడా పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ మల్లు రవికి రెండో లేఖ రాశారు. విచారణ జరుగుతుండగానే ఇంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా తనపై విమర్శలు చేయడం, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడం వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తేల్చాలన్నారు. ఈ ఎమ్మెల్యేల అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించడం క్రమశిక్షణా సంఘం నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని, దానిపైనా విచారణ చేయాలని కోరారు. ఈ లేఖ వివాదానికి ఆజ్యం పోసింది. భట్టిని కలిసేందుకు కొండా మురళి సమయం అడిగినట్లు తెలుస్తోంది. భట్టి సమయం ఇవ్వలేదని సమాచారం.


సోమవారం రాష్ట్రానికి సీఎం

సురేఖ విషయంలో ఏం చేయాలి అన్న దానిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాలు, మంత్రివర్గంలో చేయాల్సిన సర్దుబాట్లపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌ పర్యటన ముగించుకొని సోమవారం ఉదయం హైదరాబాద్‌ వస్తున్నారు. అనంతరం ఆయనతో అధిష్ఠానం మాట్లాడనుందని సమాచారం. ఇప్పటికే ప్రాథమికంగా సీఎంతో అధిష్టాన ప్రతినిధులు మాట్లాడినప్పటికీ ఆయన తిరిగొచ్చాక మరింత లోతుగా చర్చిస్తారు.

Updated Date - Aug 23 , 2026 | 05:17 AM