Share News

సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:54 AM

సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపైన తన కూతురు సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు

  • ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్దం

  • నా కూతురి వ్యాఖ్యలు పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు

  • ఇందులో నా ప్రమేయం లేదు

  • నోటీసును ఉపసంహరించుకోండి

  • క్రమశిక్షణ కమిటీకి మంత్రి సురేఖ వివరణ

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపైన తన కూతురు సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి రాజకీయ అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదని చెప్పారు. కొండా సుస్మితా పటేల్‌ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమన్నారు. ఈ మేరకు గురువారం ఆమె టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీకి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపైన, పార్టీ క్రమశిక్షణా నియమావళిపైన తనకు సంపూర్ణ గౌరవం ఉందని కొండా సురేఖ చెప్పారు. తాను వెల్లడించిన వాస్తవాలు, ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి.. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవ పూర్వకంగా కోరుతున్నానని అన్నారు. కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆమె స్వస్థలం గీసుకొండలో కొండా అభిమానులు బుధవారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుిస్మితా పటేల్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ బుధవారం రాత్రే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ చైర్మన్‌ మల్లు రవి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసును అందుకున్న కొండా సురేఖ.. గురువారంనాడు ఈ మేరకు వివరణను మల్లు రవికి పంపారు.


వివరణ పూర్తి పాఠం ఇదీ!

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ శ్రీ మల్లు రవి గారికి,

విషయం: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి నా వివరణ

నా జన్మదినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘‘కొండా’’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు చేసుకున్నారు. ేసవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా, నా స్వస్థలమైన గిసుకొండతో నాకున్న ప్రత్యేక అనుబంధంతో, అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుష్మిత పటేల్‌ పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన సొంత అభిప్రాయాలకు సంబంధించినవని. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, దీనికి నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రానికి విరుద్థమని వినయంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉంది. పై వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి, నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవ పూర్వకంగా కోరుతున్నాను.

Updated Date - Aug 21 , 2026 | 05:55 AM