కొండా సురేఖకు షోకాజ్
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:21 AM
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల పలువురు నేతలు పార్టీ లైన్ తప్పి మాట్లాడుతుండడాన్ని నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం..
సీఎం రేవంత్‌రెడ్డి మీద సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు
3 రోజుల్లో వివరణివ్వాలని సురేఖకు ఆదేశం
మేఘారెడ్డిపై ఆరోపణలు.. చిన్నారెడ్డికీ నోటీస్
సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై సస్పెన్షన్
సుస్మిత వ్యాఖ్యలు సరికాదు: మల్లు రవి
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల పలువురు నేతలు పార్టీ లైన్ తప్పి మాట్లాడుతుండడాన్ని నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వంటివారి వ్యాఖ్యలపై ఇప్పటికే పరిశీలన జరుపుతున్న టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ.. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో అప్రమత్తమైంది. క్రమశిక్షణ తప్పి.. పార్టీకి నష్టం చేస్తున్నవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కనికరం చూపకూడదనే నిర్ణయానికి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌షరెడ్డిపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ మల్లు రవి బుధవారం నోటీసులు జారీ చేశారు. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్‌కు, మల్లు రవికి మేఘారెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదునూ పరిశీలించిన కమిటీ.. బుధవారం చిన్నారెడ్డికి కూడా నోటీసు జారీ చేసింది. ఇక రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి తండ్రి, పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పలువురు నేతలను వ్యక్తిగతంగా, కులపరంగా దూషించడం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై వచ్చిన ఫిర్యాదులను, ఇందుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన క్రమశిక్షణ చర్యల కమిటీ.. ప్రభాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది.
గీత దాటితే ఉపేక్షించేది లేదు..
ఉట్నూరులో జరిగిన డీసీసీ పీఏసీ సమావేశంలో పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ నేత సంజయ్‌లకూ మల్లు రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదులపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా పార్టీ నేతలు ఎవరైనా కట్టు దాటితే ఉపేక్షించేది లేదన్న సంకేతాన్నివ్వాలని నాయకత్వం నిర్ణయించింది. మల్లు రవి బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో కొందరు గీత దాటుతున్నట్లు అనిపిస్తోంది. క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడితే.. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఏం మాట్లాడారో సమగ్రంగా తెలుసుకుంటాం. పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే చర్యలు తీసుకుంటాం. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె మాట్లాడిన తీరు పార్టీ ప్రతిష్ఠను, సీఎం రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉంది. దీనిపై వివరణ తీసుకుంటాం. ఆపై పీసీసీ అధ్యక్షుడు, ఇన్‌చార్జితో మాట్లాడి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం’’ అని మల్లు రవి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు లోబడే మాట్లాడాలని, పార్టీ లక్షణరేఖను దాటి వ్యవహరిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.