కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు!
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:47 AM
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. తన పేరిట ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ రియల్డర్‌ను ఒక కార్యాలయానికి పిలిపించి సుమంత్..
రియల్టర్‌పై ఇనుప రాడ్లతో దాడి చేసిన సుమంత్.. బాధితుడి చేయి ఫ్రాక్చర్.. రక్తపు వాంతులు
20 రోజుల క్రితం ఘటన.. ఆసుపత్రిలో బాధితుడు.. మేడిపల్లిలో జీరో ఎఫ్‌ఐఆర్.. జూబ్లీహిల్స్‌కు బదిలీ
బంజారాహిల్స్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. తన పేరిట ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ రియల్డర్‌ను ఒక కార్యాలయానికి పిలిపించి సుమంత్, మరికొందరు కలిసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ చెంగిచర్ల రోడ్డులోని ఆర్టీసీ కాలనీకి చెందిన గొంగిడి హరికృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారి. జూలై 30న పనిమీద ఊరెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చాక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర్నుంచి అతడికి ఫోన్ వచ్చింది. అర్జంటుగా మాట్లాడాలి అని సుమంత్ చెప్పగా మరుసటి రోజు వస్తానని చెప్పాడు. జూలై 31న హరికృష్ణకు అతని స్నేహితుడు రాము ఫోన్ చేసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 1లో ఉన్న తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ మేరకు అద్దె కారులో హరికృష్ణ మరో స్నేహితుడు కిరణ్‌తో కలిసి వెళ్లాడు. కార్యాలయంలో రాముతో పాటు సుమంత్ కూడా ఉన్నాడు. ‘నా పేరు చెప్పి బయట డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు?‘ అంటూ సుమంత్ తీవ్ర ఆగ్రహంతో హరికృష్ణను నిలదీశాడు. తాను ఎవరి వద్దా డబ్బు వసూలు చేయలేదని హరికృష్ణ సమాధానం ఇచ్చాడు.
వినిపించుకోకుండా సుమంత్ దుర్భషలాడుతూ, అక్కడే ఉన్న ఇనుప రాడ్లతో హరికృష్ణ చేతులు, కాళ్లపై దాడి చేశాడని, కొద్ది సేపటికి అక్కడకు వచ్చిన అనుచరులతో హరికృష్ణను చంపేయండి అని చెప్పి వెళ్లిపోయాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సుమంత్ అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్‌రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి కర్రలు, ఐరన్ రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో హరికృష్ణ ఎడమ చేయి విరిగింది. తీవ్ర గాయాలై, రక్తపు వాంతులు కూడా చేసుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని బాధితుడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో తక్షణ వైద్యం చేయించుకుని వస్తానని చెప్పి బాధితుడు అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లాడు. గాయపడిన హరికృష్ణ తొలుత గాంధీ ఆసుపత్రిలో, ఆ తర్వాత చెంగిచర్లలోని ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందాడు. ఎడమ చేయి ఎముక విరగడంతో మెరుగైన చికిత్స కోసం ఉప్పల్‌లోని శ్రీ హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆగస్టు 10న శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రాణభయం ఉండటంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం వల్ల ఫిర్యాదు చేయలేక పోయిన హరికృష్ణ గురువారం మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సుమంత్‌తో పాటు అతని అనుచరులపై సెక్షన్ 109, 3(5) కింద కేసు నమోదు చేశారు. ఘటన జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకోవడంతో జీరో ఎఫ్‌ఐఆర్ చేసి బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.