సురేఖపై వేటు!
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:10 AM
సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ పదే పదే విమర్శలు చేస్తుండడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో అధిష్ఠానం
సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలతో సీరియస్
కఠిన నిర్ణయంతో ఇతర నేతలకు సంకేతమివ్వాలనే ఆలోచన
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానా? లేక ప్రత్యేకమా?
సురేఖను తప్పించాలనుకుంటే మున్నూరుకాపు నేతకు చాన్స్!
పద్మశాలి సామాజికవర్గ కోటాలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత
సురేఖ, రాజగోపాల్ తదితరులపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి
క్రమశిక్షణ తప్పినవారిపై కఠిన చర్యలకు అధిష్ఠానానికి విజ్ఞప్తి
సీఎం హైదరాబాద్‌కు వచ్చాక స్పందిస్తానన్న మంత్రి సురేఖ
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ పదే పదే విమర్శలు చేస్తుండడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయివుండీ.. తన కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖ అదుపు చేయకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. స్వయంగా సురేఖ సైతం గతంలో సినీ నటులపై, సొంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లెక్కల్లోకి వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉందని, తద్వారా సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నాయకులకు గట్టి సంకేతం ఇవ్వాలనుకుంటోందని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించాలా? అన్నదానిపై తర్జన భర్జన పడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి కొండా సుస్మితా పటేల్ గతంలోనూ ఓసారి సీఎం రేవంత్‌రెడ్డిపై, ఆయన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. హైడ్రామా సృష్టించారు.
అయితే అప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ జోక్యం చేసుకుని మంత్రి సురేఖతో మాట్లాడారు. ఆ తర్వాత తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. అయితే ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డిపై, ఆయన సోదరులపై సుస్మిత మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధ్యత గల మంత్రి కుమార్తె అయివుండీ ముఖ్యమంత్రిపైనే పదే పదే విమర్శలు చేస్తుండటంపై నాయకత్వం సీరియస్ అయింది. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీసు ఇచ్చారు. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, అందుకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ కొండా సురేఖ వివరణ పంపారు. అయితే ఆ వివరణలో ఎక్కడా కొండా సుస్మిత వ్యాఖ్యలను ఆమె ఖండించలేదు. దీంతో ప్రభుత్వ విప్‌లు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం సీఎల్పీ మీడియా హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కొండా సురేఖ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సుస్మిత మాటలను బాధ్యత గల మంత్రిగా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మంత్రి సురేఖ, ఆమె కూతురు వాడుతున్న భాషకు పార్టీ, ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందన్నారు. కొండా సురేఖ నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వరకు ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణను తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడికి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని బలహీన పరిచేందుకు కొండా సురేఖ కుట్ర చేస్తున్నారని, స్వపక్షంలో ఉండి ప్రతిపక్షానికి ఆయుధంగా మారారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ను బలహీనపరిస్తే పార్టీ, ప్రభుత్వమూ.. వాటితోపాటే తమ భవిష్యత్తూ బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ప్రయత్నాలు చేస్తే.. పార్టీ నాయకత్వం ఊరుకున్నా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
పునర్వ్యవస్థీకరణలోనా.. ప్రత్యేకంగానా!?
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతుందా? లేక ఈ ఒక్క కేసునే పరిగణనలోకి తీసుకుంటారా? అన్నదానిపై స్పష్టత లేదు. సమస్యను సాఫీగా ముగించాలని అధిష్ఠానం భావిస్తే మాత్రం.. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఈ వివాదంపై సీఎం రేవంత్ వచ్చాకనే తాను మాట్లాడతానని చెప్పారు. క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సింది చెప్పేశానని, కొత్తగా చెప్పాల్సిన విషయాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక సురేఖ.. ఆయనను కలిసే అవకాశం ఉందంటున్నారు. ఈ వివాదాన్ని మరోమారు క్షమాపణతో ముగించే ప్రయత్నాలు కూడా కొందరు నాయకులు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించి.. వేరే ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంచవచ్చని అంటున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ.. తన భర్త కొండా మురళికి సంబంధించి మున్నూరుకాపు సామాజికవర్గం, తనకు సంబంధించి పద్మశాలి సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. ఆ రెండు సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు మున్నూరుకాపుల నుంచే వేరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు, పద్మశాలి సామాజికవర్గానికి గవర్నర్ కోటాలో త్వరలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. పద్మశాలి సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావిస్తే.. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సీఎం రేవంత్‌రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.