Share News

కొండా వర్సెస్‌ కడియం!

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:52 AM

అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, వరంగల్‌ జిల్లా నేతల మధ్య రాజకీయ వైరం మరోసారి బయటపడ్డాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

కొండా వర్సెస్‌ కడియం!

  • నా శాఖ కార్యాలయంలో.. నాకు తెలియకుండానే సమీక్ష

  • ఇది నిబంధనల ఉల్లంఘనే.. కడియంపై చర్యలు తీసుకోండి

  • గతంలోనూ నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కడియం కుట్రలు

  • సీఎం రేవంత్‌కు మంత్రి సురేఖ లేఖ.. అధిష్ఠానానికీ ఫిర్యాదు

  • పార్టీ క్రమశిక్షణా సంఘంతో విచారణ జరపాలని విజ్ఞప్తి

  • దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కడియం సమీక్ష

  • మంత్రికి కనీస సమాచారం ఇవ్వని ఆ శాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్‌/వరంగల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, వరంగల్‌ జిల్లా నేతల మధ్య రాజకీయ వైరం మరోసారి బయటపడ్డాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అందుకు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం వేదికైంది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వివాదం ఇప్పుడు పార్టీ అధిష్ఠానం వద్దకు చేరింది. దేవాదాయ శాఖపై కడియం సమీక్ష నిర్వహించడమే ఈ వివాదానికి కారణం. తనకు ఏ మాత్రం సమాచారం లేకుండా తన శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా ఆదేశాలు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని మంత్రి సురేఖ సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. కడియం హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ డైరెక్టర్‌ హనుమంత్‌రావుతో పాటు ఆర్‌జేసీ, ఏడీసీలు ఇతర ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. కీలక అంశాలపై ఎమ్మెల్యే కడియం సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి సురేఖ సీఎంకు మూడు పేజీల లేఖతో పాటు కడియం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని విస్మరించి సమావేశం నిర్వహించడం, మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలపై ఆదేశాలు జారీ చేయడం పరిపాలన వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్యగా పేర్కొన్నారు. ఇది సాధారణ పరిపాలన లోపంగా కాకుండా, శాఖ మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. కడియం గతంలో కూడా తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి తనపై దుష్ప్రచారానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కడియం నుంచి వివరణ కోరాలని, ఆయనకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. పార్టీ క్రమశిక్షణా కమిటీతో విచారణ జరిపించి కడియంపై చర్యలు తీసుకోవాలన్నారు.


మంత్రిని లెక్క చేయని అధికారులు!

దేవాదాయ శాఖలో అధికారుల తీరుతో మంత్రికి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. గతంలోనూ ఇతర శాఖకు చెందిన మంత్రి దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించడం, కొండా సురేఖ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ వైపు రాజకీయంగా పరిస్థితి అలా ఉంటే మరోవైపు మంత్రి సిఫారసుల్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ మంత్రిని వేరే విషయంలో కలిసినా ఆమె కూడా సమీక్ష విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిసింది. సమీక్షలో పాల్గొన్న అధికారులు ఎవరూ కూడా మంత్రికి సమాచారం ఇవ్వలేదు. ఇటీవల జరిగిన సరస్వతీ నది అంత్యపుష్కరాలకు సంబంధించిన కొన్ని పనుల్లో సైతం మంత్రికి సమాచారం లేకుండానే టెండర్లు పిలిచి, పనులు అప్పగించినట్లు చర్చ జరిగింది. మేడారం జాతర సమయంలోనూ మంత్రికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓ వైపు అధికారులు ఇలా వ్యవహరిస్తుంటే మరోవైపు మంత్రి సైతం శాఖపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆలయాలకు బడ్జెట్‌ జారీ అధికారాన్ని అధికారుల నుంచి తొలగించి తన చేతుల్లోకి తీసుకోవడం కూడా అందులో భాగమేనని చర్చ జరుగుతోంది. కడియం సమీక్ష, మంత్రి ఫిర్యాదు నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - Jul 08 , 2026 | 05:53 AM