117 స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తాం
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:10 AM
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 117 నియోజకవర్గాల్లో విజయం సాధించి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఎక్కడెక్కడ గెలుస్తామో గుర్తించాం.. ఆలస్యమైనా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం
బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదు: మంత్రి కోమటిరెడ్డి
నార్కట్‌పల్లి, యాదాద్రి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 117 నియోజకవర్గాల్లో విజయం సాధించి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ గెలుస్తామో గుర్తించామని తెలిపారు. కేంద్ర పథకం ‘సేతుబంఽధన్’ కింద రూ.76 కోట్ల సీఆర్‌ఐఎఫ్ నిధులతో తెలంగాణలోనే తొలిసారిగా.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో నిర్మించనున్న ఆర్‌వోబీకి ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎ్‌సకి గతమే తప్ప భవిష్యత్తు ఉండదన్నారు. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో 30నుంచి 40 స్థానాలకే పరిమితమవుతుందన్నారు. పునర్విభజనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఆరు వరకు నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో హ్యామ్ పథకంలో ప్యాకేజీ-1 రూ.339.59 కోట్లు, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ప్యాకేజీ-2లో 358.18 కోట్లతో రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశా రు. ఇవి పూర్తయితే నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు రవాణా సౌకర్యాలు మెరు గుపడతాయని ఆయన పేర్కొన్నారు. హామీల అమలులో జాప్యం జరిగినా, అన్నిటినీ తీరుస్తున్నామన్నారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టినా ఆలేరు, భువనగిరికి రెండు కాల్వలు తవ్వలేదన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు తాను కొట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా, యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నాయకులు, ప్రజాప్రతినిధులు క్రేన్ సాయంతో భారీ గజమాలను తెచ్చి మంత్రికి స్వాగతంపలికేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్రేన్ నుంచి గజమాల ఆకస్మికంగా తెగిపడింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.