యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి నియామకంపై నాకు సమాచారం లేదు
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:42 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మరో సారి సొంత ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాదగిరి గుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటుపై తనకు సమాచారం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఏకపక్ష ...
సీనియర్లను ఎలా గౌరవించాలో తెలియదా?
ఆ జిల్లా ఎమ్మెల్యేకు చెప్పాలన్న ఇంగితం లేదా?
పార్టీలో ఒరిజినల్ నేతలు కనుమరుగవుతున్నారు
వ్యవహార శైలి నచ్చకనే సీఎం సభకు వెళ్లలేదు: రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మరో సారి సొంత ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాదగిరి గుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటుపై తనకు సమాచారం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. ధర్మకర్తల మండలిపై సమాచారం ఇచ్చి ఉంటే.. తన నియోజకవర్గం నుంచి ఒక్క సభ్యుడినైనా నియమించాలని అడిగేవాడినని అన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి గురించి మాట్లాడదలచుకోలేదని, సభ్యుల నియామకం గురించైనా చెప్పాలి కదా?అని ప్రశ్నించారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం వారి కర్మ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నానని, రాహుల్‌గాంధీనీ కలుస్తున్నానని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మకర్తల మండలిలో తమకూ అవకాశం ఇస్తే బాగుండేదని అన్నారు. ‘‘అందరూ సీనియర్ నాయకులే. పార్టీని ఎలా నడపాలో తెలిసిన వాళ్లే. నియామకాలు ఎలా చేయాలి? సీనియర్ నాయకులను ఎలా గౌరవించాలి? అనేది తెలియదా?’’అని అసహనం వ్యక్త చేశారు. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకులు.. రోజురోజుకూ కనుమరుగైపోతున్నారని, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్త వాళ్లదే నడుస్తోందని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి. షో అప్ చేయడం, హంగామా చేయడం ప్రజలకు నచ్చదు. నల్లగొండలో సీఎం సభకు వెళ్లాలన్న ఆసక్తి లేక, వారి వ్యవహార శైలి నచ్చకనే వెళ్లలేదు’’అని స్పష్టం చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంచి ఉద్దేశంతోనే దానకర్ణుడంటూ తనగురించి మాట్లాడారని తెలిపారు.