కామారెడ్డిలో హైటెన్షన్
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:36 AM
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముదిరిన వివాదం
కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా చైర్‌పర్సన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారని, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను ఇతరులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మరుసటి రోజు ప్రెస్‌మీట్ పెట్టి షబ్బీర్‌అలీపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని రూ.కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కలప, సారా అమ్ముకుని పైకి వచ్చారని ఆరోపించారు. దీంతో కింది స్థాయి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్ద ఉదయం 10 గంటలకు తాను చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకొని రావాలని, తాను ఒక్కడినే వస్తానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పిలుపును స్వాగతిస్తూ ఉదయం 8.30 గంటలకే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అప్పటికే క్యాంపు కార్యాలయానికి బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ క్రమంలో రామారెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్‌రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మహేందర్‌రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే
షబ్బీర్ అలీ తనపై చేసిన ఆరోపణలకు సీఎంవోలోనైనా చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల భూములను తాను కబ్జా చేసినా లేదా ఇతరులకు లాభం చేకూరేలా చేసినా.. సీఎం రేవంత్‌రెడ్డి ముందే చర్చకు వస్తానని తెలిపారు. షబ్బీర్‌అలీ వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని వచ్చి చూపాలని సవాల్ విసిరారు.
కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల యత్నం..
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. కామారెడ్డి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హైదరాబాద్‌లోనే పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు తెలిసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హైదరాబాద్ నుంచి వస్తుండగా మేడ్చల్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పలువురు బీజేపీ నాయకులను భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేసి నిజామాబాద్‌కు తరలించారు.