కోహెడ పండ్ల మార్కెట్ భూముల స్వాహాకు సీఎం రేవంత్ కుట్ర
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:34 AM
అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సేకరించిన 200 ఎకరాల భూమిని కాజేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని....
మార్కెట్‌కు మంగళం పాడేందుకే దిల్ భూముల అప్పగింత: హరీశ్ రావు
హయత్‌నగర్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సేకరించిన 200 ఎకరాల భూమిని కాజేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. మార్కెట్ నిర్మాణానికి అనువైన ఈ భూమిని వదిలి వివాదాల్లోని దిల్ కంపెనీజాగాల్లో నిర్మిస్తారా.. ఇది జరిగే పనేనా అని ప్రశ్నించారు. ఇది పండ్ల మార్కెట్‌కు మంగళం పలకడమే అన్నారు. తమ ప్రభుత్వం కేటాయించిన భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల కోట్లు ఉందన్నారు. దాన్ని టీజీఐఐసీ ద్వారా తక్కువ ధరకు సీఎం తన అనుయాయులు, దళారులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కాగా కోహెడలోని సర్వే నం. 507, 548లో నిర్మించాల్సిన పండ్ల మార్కెట్‌ను సర్వే నం.167కు తరలించడాన్ని నిరసిస్తూ... ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రైతులతో కలిసి సోమవారం చేపట్టిన నిరసనకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మార్కెట్‌కు భూములిచ్చిన రైతులకు రూ.10 కోట్లు నష్ట పరిహారం ఇచ్చాం.. రూ. వెయ్యి కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశాం.. రూ. 350 కోట్లు మార్కెట్ శాఖకు కేటాయించాం’ అన్నారు. టెండర్లు పిలిచి మార్కెట్ నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొండలు, గుట్టలున్న భూమి కేటాయించడంలో ఆంతర్యమేంటన్నారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు.. ముఖ్యమంత్రి రోజూ భూమి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఎక్కడైనా భూమి కనిపిస్తే లాగేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతుల పక్షపాతైన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సీఎంను ఒప్పించి అంతర్జాతీయ ప్రూట్ మార్కెట్‌ను ఇక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు.