Share News

ఇట్లుంటది కొడంగల్‌ వెంకటేశ్వరస్వామి ఆలయం

ABN , Publish Date - May 06 , 2026 | 07:29 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ ఖరారైంది.

ఇట్లుంటది కొడంగల్‌ వెంకటేశ్వరస్వామి ఆలయం

  • డిజైన్‌ ఖరారు.. రూ.110 కోట్లతో ఆలయ అభివృద్ధి

  • త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ ఖరారైంది. ఆలయ అభివృద్ధి కోసం దాదాపు రూ.110 కోట్లు ఖర్చు చేయనున్నారు. టెండర్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి ఈ నెల 15వ తేదీ నుంచే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2027 మే 31 నాటికి ఆలయ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలయం డిజైన్‌, అక్కడ నిర్మించే ఇతర వసతులు, కల్పించే సౌకర్యాలు సహా అన్ని వివరాలను ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించారు. దాని ప్రకారం.. ఆలయానికి 4వైపులా గోపురాలను నిర్మించనున్నారు. ప్రధాన ఆలయం కోసమే దాదాపు రూ.51.50 కోట్లను వెచ్చించనున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భూ వరాహస్వామి, బేడీ ఆంజనేయ స్వామి, శ్రీ భీమేశ్వర ఆలయాల నిర్మాణానికి రూ.13 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక, మరో రూ.26 కోట్ల వ్యయంతో ఆలయం బయట పరిపాలన భవనం, వంటశాల, అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. ఆలయ ప్రాంగణం అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు. కాగా, కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో 2025లోనే రూ.75కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేసింది. అయితే మళ్లీ అంచనాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో మరో రూ.35కోట్లను పెంచి ఆలయం అభివృద్ధి కోసం రూ.110 కోట్లను మంజూరు చేస్తూ 2026 మార్చి 28న ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. దీంతో పనుల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంది.

Updated Date - May 06 , 2026 | 07:29 AM