మంత్రి పదవి నేనడగలేదు.. కాంగ్రెస్ చెప్పలేదు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:36 AM
తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదని, తాను కూడా అడగలేదని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం వెల్లడించారు.
మే 12న టీజేఎస్ ప్లీనరీ: కోదండరాం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదని, తాను కూడా అడగలేదని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం వెల్లడించారు. అయితే తమ పార్టీకి ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని మాత్రం అడుగుతున్నామన్నారు. బుధవారం టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాటాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేధింపులు.. నిఘా లేదని, పోలీసులు వెంటపడే పరిస్థితీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ లోపాలను కవితే బయటపెడుతోందని, పార్టీ అంటే కుటుంబమే అని ఆమె చెప్పకనే చెబుతోందన్నారు. ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని, ముందునుంచే నియోజకవర్గాలను ఎంచుకుని పని చేస్తామని పేర్కొన్నారు. టీజేఎస్ ప్లీనరీ మే 12న జరగనుందని, అందులో పార్టీ భవిష్యత్తుపైన కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కోదండరాం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. టీజేఎస్ గత 8 ఏళ్లుగా ప్రజల పక్షాన నిలబడిందన్నారు. తెలంగాణలో టీజేఎస్ లేని ప్రజా పోరాటం ఏదీ లేదని, మంత్రులు.. ఎమ్మెల్యేలు కావాలన్న ఆశతో కాకుండా ప్రజలు కేంద్రంగా రాజకీయం చేశామని తెలిపారు.