యూజీ ఆయుష్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:25 AM
కన్వీనర్ కోటా కింద యూజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రొవిజనల్ మెరిట్ జాబితా, అనర్హుల జాబితాతో పాటు మాప్-అప్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల అలాట్మెంట్ జాబితాను గురువారం విడుదల చేసింది.
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కన్వీనర్ కోటా కింద యూజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రొవిజనల్ మెరిట్ జాబితా, అనర్హుల జాబితాతో పాటు మాప్-అప్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల అలాట్మెంట్ జాబితాను గురువారం విడుదల చేసింది. మొత్తం 2,136 మంది అభ్యర్థులతో కూడిన మెరిట్ లిస్టులో 441 మార్కులతో మేకల సోమేశ్వరి మొదటి స్థానంలో నిలిచింది. నాన్- లోకల్ కావడం, సర్టిఫికెట్లను సరిగా అప్లోడ్ చేయకపోవడం వంటి కారణాల వల్ల దరఖాస్తుల పరిశీలనలో 45 మందిని అనర్హులుగా గుర్తించినట్లు వర్సిటీ పేర్కొంది. ఈ జాబితాలపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17న ఉదయం 8 గంటలలోపు knruhsayush@gmail.comఈ-మెయిల్కు పంపాలని అధికారులు సూచించారు. ఇక మాప్-అప్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్ల అలాట్మెంట్ జాబితాలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ మెడికల్ కాలేజీల వారీగా సీట్ల కేటాయింపుల వివరాలను వర్సిటీ విడుదల చేసింది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18న సాయంత్రం 4 గంటల్లోగా అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వర్సిటీ రిజిస్ర్టార్ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పెరిగిన ఎంబీబీఎస్, పీజీ సీట్లకు అనుగుణంగా ఆయా కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద రూ.379 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అనుమతులు తెలుపుతూ, కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.