Share News

రాష్ట్రంలో 10 వేల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - May 24 , 2026 | 05:07 AM

తెలంగాణలో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన...

రాష్ట్రంలో 10 వేల కోట్ల పెట్టుబడులు

  • కేంద్ర సంస్థలు సిద్ధంగా ఉన్నా..రాష్ట్ర సర్కార్‌ స్పందించడం లేదు

  • ఇప్పటికైనా భూములు కేటాయించాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్‌ కార్పొరేషన్‌, కోలిండియా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్థంగా ఉన్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని గత ఏడాది అక్టోబరులోనే ఆయా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయన్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిం చి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించుకోవాలని కోరారు. ఏఐ ఆధారిత రెసిడెన్షియల్‌ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌ ‘రెంజీ’ ఆధ్వర్యంలో ‘రెనర్జైజ్డ్‌ -2026’ జాతీయ స్థాయి సదస్సును శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ నాలెడ్జ్‌ సిటీలో నిర్వహించారు. భారతదేశ ఇంధన భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్‌, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌ రెడ్డి.. దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత ేసవలు అదిస్తున్న రెసిడెన్షియల్‌ సోలార్‌ సర్వీసెస్‌ సంస్థ ‘రెంజీ’ కీ ఫీచర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని అభినందించారు. సంప్రదాయ వనరులపై దేశం ఎక్కువగా ఆధారపడకుండా పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ క్లీన్‌ ఎనర్జీ విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నేడు దేశంలో ‘పునరుత్పాదక శక్తి’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన చెప్పారు.

Updated Date - May 24 , 2026 | 05:07 AM