Share News

రైల్వేస్టేషన్‌ల అప్రోచ్‌ రోడ్లను విస్తరించండి

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:48 AM

సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా అప్రోచ్‌ రోడ్లను విస్తరించాలని సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రైల్వేస్టేషన్‌ల అప్రోచ్‌ రోడ్లను విస్తరించండి

  • సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా అప్రోచ్‌ రోడ్లను విస్తరించాలని సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రేవంత్‌కు కిషన్‌రెడ్డి ఈ మేరకు లేఖ రాశారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో పార్కింగ్‌ తదితర అవసరాల కోసం స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని కోరారు. మరోవైపు, భవిష్యత్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని రూ.715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉందని, దీన్ని కూడా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ఫా హోటల్‌ నుంచి రేతిఫైల్‌ బస్టాండ్‌ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలని కోరారు. ఈ అంశంపై గతంలో ఉత్తరం రాసినా.. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదని సీఎం రేవంత్‌కు గుర్తు చేశారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Apr 29 , 2026 | 06:49 AM