Share News

‘సర్‌’పై వారిది బాధ్యతారాహిత్యం

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:15 AM

ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్‌)పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనులశాఖ...

‘సర్‌’పై వారిది బాధ్యతారాహిత్యం

  • దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్‌)పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘సర్‌’ను మతంతో ముడిపెడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘హైదరాబాద్‌లో అక్రమ వలసదారులు లేరా? భారీగా నకిలీ ఓట్లు లేవా?’ అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ‘సర్‌’ ప్రక్రియతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ వీటిని సరిచేస్తుంటే, దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ‘సర్‌ ప్రక్రియను అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే. అయితే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే సొంత ప్రభుత్వ ఉద్యోగులపైనే వారికి నమ్మకం లేనట్లుగా కనిపిస్తోంది. పాతబస్తీలో ఇంటింటి సర్వే చేయవద్దని ఉద్యోగులను ఎంఐఎం బెదిరిస్తోంది. తాము ఇచ్చిన ఫారాలనే తీసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి’ అని కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఇక్కడి ఓటరు జాబితాలోనే తమ పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ‘మీ ఓటు గ్రామంలో లేకపోతే సంక్షేమ పథకాలు అందబోవు అంటూ కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు, సంక్షేమ పథకాలకు సంబంధం లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పాతబస్తీతో పాటు నగరంలో పలుచోట్ల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగిస్తే తమ పప్పులు ఉడకబోవని ఎంఐఎం నేతలు భావిస్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)ల ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ చేయుస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కంటోన్మెంట్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై తాము ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Updated Date - Jun 28 , 2026 | 03:15 AM