ఎక్కడా లేని సమస్య ఇక్కడే ఎందుకు?
ABN , Publish Date - May 31 , 2026 | 06:06 AM
ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా సమస్య లేదు.. కేంద్రం ఇచ్చిన కోటానే రాష్ట్రం పూర్తిచేయలేకపోతోంది
గోనె సంచులు ముందుగానే సమకూర్చుకోవాలన్న సోయి లేదా?
మంత్రులకు కమీషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే దృష్టి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
రైతు సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్
హైదరాబాద్, మే 30(ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏ సమస్యా లేదని తెలిపారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించలేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సీజన్‌కు సంబంధించి 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, శనివారం వరకు 51.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎందుకు సేకరించారని ప్రశ్నించారు. ‘గోనె సంచులను సిద్ధంగా ఉంచుకోవాలన్న సోయి ఆరు నెలల ముందే ఎందుకు లేదు? ఎంతసేపూకమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఉంది. ఆ మంత్రి ఎంత కమీషన్ తీసుకున్నారు? ఈ మంత్రి ఎంత తీసుకున్నారు? నేనెంత తీసుకోవాలి అనే మంత్రులు ఆలోచిస్తున్నారు తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. పది పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మన రాష్ట్రం నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.4,000-4,200ల చొప్పున ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాణ్యత లేని సన్నబియ్యాన్ని క్వింటాల్‌కు రూ.3,000-3,200 చొప్పున తీసుకొచ్చి ఇక్కడి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేస్తోంది’ అని ఆరోపించారు. ధాన్యం సేకరణ కోటాను పెంచేలా తాను కూడా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నాడు మిల్లర్లతో బీఆర్‌ఎస్ కుమ్మక్కు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 2020-21 సీజన్‌లో లెవీ లక్ష్యాన్ని పూర్తిచేయాలని కేంద్రం 9 సార్లు లేఖలు రాయాల్సి వచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ సీజన్‌లో కూడా లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేయలేదని ఆరోపించారు. ‘కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేద్ధామని ఓ బీఆర్‌ఎస్ నేత కాంగ్రెస్‌కు సూచించారు. కానీ, గతంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసినందుకు వాళ్లు కేసీఆర్ ఫాంహౌజ్ వద్ద ధర్నా చేయాలి’ అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు ధాన్యం పండించే రైతులను నిర్లక్ష్యం చేస్తోంది. వారి భవిష్యత్తు ఏమిటి? వారికి అవసరమైన విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నలకు జవాబు లేదు. 8,775 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా 7,180 కేంద్రాలే పనిచేస్తున్నాయి. ఇప్పటికేౖనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి. రైతు సంఘాలతో చర్చించాలి. రైతు సమస్యలపై రాజకీయాలు వద్దు’ అని కిషన్‌రెడ్డి సూచించారు.