Share News

కత్తి ఒకరికిచ్చి యుద్ధం మరొకరిని చేయమంటారా?

ABN , Publish Date - May 01 , 2026 | 05:49 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకల మీద సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

కత్తి ఒకరికిచ్చి యుద్ధం మరొకరిని చేయమంటారా?

  • అరకొర దర్యాప్తు వల్లే ‘కాళేళ్వరం’పై హైకోర్టులో ఎదురుదెబ్బ

  • లక్ష కోట్లు కక్కిస్తామని ఎన్నికల ముందు రాహుల్‌, రేవంత్‌ ప్రగల్భాలు

  • ఇప్పుడు మమ్మల్ని కక్కించమంటున్నారు

  • గత సర్కారుతో పోటీ పడుతూ అప్పులు

  • రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ధ్వజం

  • ఎంపీలను వెధవలని అంటారా? ఒక మాజీ సీఎం మాట్లాడే పద్ధతి ఇదేనా?

  • కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు

  • రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ.7,823 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తారని వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకల మీద సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘హైకోర్టులో ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? సమగ్ర దర్యాప్తు జరపాలని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. అరకొర దర్యాప్తు చేస్తే ఇలాగే ఉంటుంది. సీఎం రేవంత్‌ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి లక్ష కోట్లు కక్కిస్తా అని ఎన్నికల ముందు పలికిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని కక్కించమంటున్నారు’ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోటీ పడుతూ ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు చేస్తోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల మీద కేసీఆర్‌ ఇటీవల ఓ సభలో స్పందించిన తీరును కిషన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ‘రెండున్నరేళ్ల తర్వాత బయటకు వచ్చి, పార్లమెంటులో వాడు వెధవ వీడు వెధవ అంటూ మాట్లాడుతున్నారు. ఎంపీలను వెధవ అని అంటారా? అది పద్ధతేనా? ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు మాట్లాడే తీరు ఇదేనా? మైకు దొరగ్గానే నోటికొచ్చినట్లు మాట్లాడుతారా?’ అంటూ ధ్వజమెత్తారు. ఎంపీ సీట్లు గెలవలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయినట్లు మాట్లాడారు కదా, మరి ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నరేళ్లు ఏం చేశారు? ఎందుకు బయటకు రాలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు.


ఒవైసీ కళ్లలో ఆనందం కోసం..

ఒవైసీ కళ్లలో ఆనందం చూడటం కాంగ్రెస్‌ ఆకాంక్ష అని, అందుకే డీలిమిటేషన్‌ బిల్లును ఆ పార్టీ వ్యతిరేకించిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నీతిమాలిన, దిక్కుమాలిన, సన్నాసి రాజకీయం చేసిందని, దక్షిణ భారతదేశానికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ పెత్తనం కొనసాగించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా డీలిమిటేషన్‌ అంశంపై కాంగ్రె్‌సకు వంత పాడిందన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొందరికి వినిపించకపోయినా, కనిపించకపోయినా ఏమీ చేయలేమని, వారికి అర్థం చేయించలేమని కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలుసన్నారు.

మోదీ పర్యటనలో పలు ప్రాజెక్టుల ప్రారంభం

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు, కొన్ని ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన తర్వాత కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తీసుకుని, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలనే ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. ‘జహీరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన భారీ టర్మినల్‌ను ప్రారంభిస్తారు. ఇందులో పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం నిల్వ, సరఫరా సదుపాయాలు ఉంటాయి. 1.6 లక్షల కిలోలీటర్ల సామర్థ్యంతో మల్కాపూర్‌ వద్ద రూ.611 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. వీటితోపాటు.. ఆధునీకరణ పనులు పూర్తయిన జోగులాంబ-గద్వాల, హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. రూ.1,243 కోట్ల వ్యయంతో కాజీపేట నుండి విజయవాడ వరకు మూడో రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయింది. దీనిని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కాజీపేట, పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ల వద్ద నిర్మించిన బైపాస్‌ రైల్వేలైన్‌ లను సైతం ప్రారంభించనున్నారు’ అని కిషన్‌రెడ్డి వివరించారు.

Updated Date - May 01 , 2026 | 05:49 AM