Share News

రౌడీలా రేవంత్‌రెడ్డి!

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:21 AM

రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన రౌడీలా వ్యవహరిస్తున్నాడన్నారు.

రౌడీలా రేవంత్‌రెడ్డి!

  • బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు

  • నన్ను అడ్డుకునే ధైర్యం, శక్తి ఆయనకు లేవు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన రౌడీలా వ్యవహరిస్తున్నాడన్నారు. దీనిపై తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తనను అడ్డుకునే ధైర్యం, శక్తి రేవంత్‌రెడ్డికి లేవని చెప్పారు. సీఎంగా ఉన్న వ్యక్తి తనపై అకారణంగా, అన్యాయంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాను నమ్మిన పార్టీ, సిద్ధాంతం కోసం ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ వరకు వచ్చాను తప్ప సీఎం రేవంత్‌లా లక్ష్యాన్ని చేరుకునేందుకు పార్టీలు మారుతూ అధికారంలోకి రాలేదని చెప్పారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నాననే సోయి మరిచిపోయి తెలంగాణలో ఏ రకంగా అవినీతి, అక్రమాలకు, దోపిడీకి పాల్పడుతున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారన్నారు. ‘‘మీరు రెండున్నరేళ్లుగా ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? ప్రెస్‌క్లబ్‌లో లేదా అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా?’’ అని కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కు సవాల్‌ విసిరారు. ప్యాంటుల్లో తొండలు వదలడం, కళ్లు పీకి గోళీలు ఆడడం, పొట్టచీల్చి పేగులు మెడలో వేసుకోవడం వంటి అలవాట్లు తనకు లేవని ఎద్దేవా చేశారు. రేవంత్‌ తన మీద సంస్కారహీనంగా అనేక రకాల అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘తొక్కుకుంటూ వచ్చాను, పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను’ అని మాట్లాడుతున్నారని.. ఒక సీఎం ఇలా వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకొని, అడ్డగోలుగా మాట్లాడుతున్న తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రేవంత్‌ లాగా తాను మాటకారిని కాకపోవచ్చు కానీ.. మాటమీద నిలబడే వ్యక్తినని స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రజలకు జవాబుదారీని తప్ప రేవంత్‌రెడ్డికి కాదని కిషన్‌రెడ్డి అన్నారు. సీనియర్‌ జర్నలిస్టులతో కమిటీ ఏర్పాటు చేద్దామని, తాను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో రేవంత్‌ చెప్పాలని, ఆయన దగ్గరున్న సాక్ష్యాలను జర్నలిస్టులకు ఇవ్వాలని సూచించారు. వారు ఏ నివేదిక ఇచ్చినా తాను కట్టుబడి ఉంటానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే రాజీనామా చేసేందుకూ సిద్ధమేనన్నారు.

మెట్రో ఫేజ్‌-2కు సూత్రప్రాయ ఆమోదం

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విషయంలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని కిషన్‌రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎందుకు గాలిమాటలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని రేవంత్‌ను ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని అన్నారు. మామునూరు విమానాశ్రయానికి త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 04:21 AM