రేవంత్‌రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. మజ్లి్‌సదే
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:41 AM
మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దేశంలో కొత్త నాయకత్వం వస్తుందేమోనన్న భయం విపక్షాల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.....
దక్షిణాదికి అన్యాయమెలా జరిగిందో చెప్పగలరా?
ఆ వ్యాఖ్యలు తప్పేనని తేజస్వీ సూర్య అంగీకరించారు
నేను కూడా తప్పయిందని చెప్పా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దేశంలో కొత్త నాయకత్వం వస్తుందేమోనన్న భయం విపక్షాల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లు అమలు, సీట్ల పెంపుతో తరతరాలుగా ఉన్న ప్రాబల్యం తగ్గుతుందని కొందరిలో భయం నెలకొందన్నారు. సీఎం రేవంత్ చెబుతున్నది.. మజ్లిస్, కాంగ్రెస్ హైబ్రిడ్ ఫార్ములా అని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఫార్ములాతో దక్షిణాదికి న్యాయమా? అన్యాయమా? అనే అంశంపై చర్చించేందుకు సిద్ధమేనా? అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో సీట్లు పెరిగేలా, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా సర్వసమాన న్యాయంతో మోదీ ఫార్ములా సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజనపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలోనే ఒప్పుకొన్నారని, తాను సైతం తప్పయిందని చెప్పానని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఉండొద్దని మొదటి నుంచి మజ్లిస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. ‘‘రిజర్వేషన్ సీట్లలో ముస్లిం మహిళలు కార్పొరేటర్‌గా గెలిచినా వారిని ఇంటినుంచి బయటకు రానీయరు. వారికి ఎటువంటి హక్కులు దక్కనీయరు. మహిళలు వంటింటి కుందేలుగా, పిల్లలు కనే మిషన్లుగా మాత్రమే ఉండాలనేది మజ్లిస్ ఆలోచన’’ అని అన్నారు. ‘‘ఈ హైబ్రిడ్ ఫార్ములాను మజ్లిస్ రూపొందించిది. అందుకే అసదుద్దీన్ కూడా పార్లమెంటులో రేవంత్ రెడ్డి ఫార్ములాను ప్రశంసించారు’’ అని పేర్కొన్నారు.