బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:05 AM
రాష్ట్రంలో బెదిరింపులు, హత్యారాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని, ఈ కారణంగానే మంత్రులు..
కాంగ్రెస్ సర్కార్ ప్రజావిశ్వాసం కోల్పోయింది: కిషన్‌రెడ్డి
మక్తల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బెదిరింపులు, హత్యారాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని, ఈ కారణంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య సత్యమ్మకు రూ.10 లక్షల చెక్కును అందించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల సంగతేమిటని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే తనతో పాటు ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటులో ప్రస్తావించామని తెలిపారు. ఈ విషయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. గిరిజన నేత ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని, వెంటనే బాధిత కుటుంబం వద్దకు వెళ్లి ధైర్యం చెప్పి అండగా నిలవాలని సూచించడంతో తాను ఢిల్లీ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మహదేవప్ప ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.