యువశక్తితోనే దేశం బలోపేతం
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:39 AM
యువశక్తి బలోపేతం అయితేనే దేశం బలపడుతుందనేది ప్రధాని మోదీ ఆలోచన అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.
ఇదే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నేడు పరేడ్ గ్రౌండ్‌లో యోగా డే కౌంట్‌డౌన్ కార్యక్రమం
రాంనగర్/సికింద్రాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): యువశక్తి బలోపేతం అయితేనే దేశం బలపడుతుందనేది ప్రధాని మోదీ ఆలోచన అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధించేందుకు యువతకు సాధికారత కల్పించడం ఒక నేషనల్ మిషన్‌గా మారిందని తెలిపారు. ఏ అభివృద్ధి చెందిన దేశానికైనా అసలైన బలం శ్రామిక శక్తి, యువశక్తే అని పేర్కొన్నారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలు పెంచుతూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థల యుజమానులను అభినందించారు. యువతకు ప్రయోజనాలు అందించేందుకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లో పాల్గొనాలని కోరారు. రైల్వేలు, రహదారులు, పరిశ్రమలు, టెక్నాలజీ, మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. యువశక్తి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలంటే ప్రతి యువకుడికి నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్య శిక్షణ, మంచి ఆరోగ్యం, సరైన ఉపాధి అవకాశాలు, విశ్వాసం కలిగించే నాయకత్వం, అంకితభావంతో కూడిన పాలన ఉండాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 2020 నుంచి 2025 మధ్య కాలంలో 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 3.45 కోట్ల మంది దేశ శ్రామిక శక్తిలో భాగస్వాములయ్యారని చెప్పారు. రోజ్‌గార్ మేళాల ద్వారా 12 లక్షలకు పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అపాయింట్‌మెంట్ లెటర్స్‌ను ప్రధానమంత్రి స్వయంగా పంపిణీ చేశారని తెలిపారు. తెలంగాణలోనే 25 వేలకు పైగా సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తమ పేర్లను ఈ పథకంలో నమోదు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంక టస్వామి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.
యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీ సర్కారుదే
ఈ నెల 21న యోగా దినోత్సవాలను పురస్కరించుకొని శనివారం పరేడ్‌గ్రౌండ్‌లో 24 గంటల కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సినీనటులు, యోగా నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన ప్రాచీన యోగ విద్యను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం 200 దేశాల్లో యోగా డే జరుపుకొంటున్నారని చెప్పారు. కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.