Share News

రేవంత్‌వి దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:57 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రుణం రాకుండా తాను అడ్డుకున్నానని సీఎం రేవంత్‌ ఆరోపించడం...

రేవంత్‌వి దిగజారుడు రాజకీయాలు

  • మెట్రో రుణాన్ని అడ్డుకోలేదు.. ఖట్టర్‌ ప్రతిపాదించిన అంశాలకు రేవంత్‌ అంగీకరించకపోవడం వల్లే ఆలస్యం

  • సమస్యను చర్చలతో పరిష్కరించుకోవచ్చు

  • ప్రాజెక్టులను అడ్డుకునే ఆలోచన లేదు

  • మా చిత్తశుద్ధికి కాంగ్రెస్‌ సర్టిఫికెట్లు అవసరం లేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రుణం రాకుండా తాను అడ్డుకున్నానని సీఎం రేవంత్‌ ఆరోపించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని అన్నారు. రేవంత్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ విషయమై తాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఖట్టర్‌తో ఫోన్‌లో మాట్లాడగా.. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక, సాంకేతిక అంశాల్లో తెలంగాణ ఇచ్చిన ప్రతిపాదనల వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పినట్లు వెల్లడించారు. ఐఆర్‌ఎఫ్‌సీతో రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకరాం మెట్రో ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి ఉందని తెలిపారు. అయితే, ముందుగా మెట్రో నిర్వహణ, కార్యాకలపాల కోసం ఖర్చు పెట్టాలని, మిగిలిన ఆదాయాన్ని ఫేజ్‌ 2, ఐఆర్‌ఎఫ్‌సీ రుణాల కోసం చెల్లించాలని ఖట్టర్‌ ప్రతిపాదించగా.. సీఎం రేవంత్‌ అంగీకరించలేదని తెలిపారు. ఇది చిన్న సమస్య అని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చర్చల ద్వారా తేల్చుకోవాల్సిన అంశమని చెప్పారు. మెట్రో అంశంపై ఖట్టర్‌తో సమావేశానికి రేవంత్‌ ఎప్పుడొచ్చినా తాను కూడా వస్తానని, తనకు ఎలాంటి భేషజాల్లేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో స్వాధీనానికి రుణం ఇవ్వవద్దని తాను అన్నట్లు ఏ మంత్రి చెప్పారో రేవంత్‌ చెప్పగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ఆలోచన తనకు లేదని.. అటువంటి ఉద్దేశాలు కాంగ్రెస్‌కే ఉంటాయని ఎద్దేవా చేశారు. తాను ఆపితే ప్రాజెక్టులు ఆగవని, సీఎం రేవంత్‌ దుందుడుకు విధానంతో మాట్లాడటం సబబు కాదని అన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా, క్యాబినెట్‌ మంత్రిగా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను పనిచేశానని చెప్పారు.


తెలంగాణ అభివృద్ధి చెందాలనే కోరుకున్నాను తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తాను ఆపమన్నంత మాత్రాన.. ఏ ప్రాజెక్టును ఆపరని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తనకు, తమ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, ఈ విషయంలో తమకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టు ఖర్చు విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ విషయాన్ని తనతోపాటు సీఎం రేవంత్‌కూ కేంద్ర మంత్రి ఖట్టర్‌ చెప్పారని గుర్తు చేశారు. ‘‘తెలంగాణకు రూపాయి వచ్చినా సంతోషపడే మొదటి వ్యక్తిని నేను. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తరచూ మంత్రులను కలుస్తుంటాను. ఆ విషయాలను సోషల్‌ మీడియాలో పెడుతుంటాను. ఆ తేదీలనే.. సీఎం నాకు చెబుతున్నాడు. తెలంగాణ అభివృద్థి విషయంలో ఎవరి పాఠాలు మాకు అవసరం లేదు. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉంటాం. ఇటీవల రూ.11వేల కోట్ల సాస్కి రుణాలను 50 ఏళ్ల కోసం వడ్డీ లేకుండా ఇచ్చాం. మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవల్‌పమెంట్‌ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి వివక్ష లేకుండా మా సహకారం అందిస్తాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jun 17 , 2026 | 04:57 AM