Share News

పెట్రో ధరలు పెంచం

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:42 AM

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతుందన్న ప్రచారంలో వాస్తవంలేదని, ధరలు పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు...

పెట్రో ధరలు పెంచం

  • ధరలు పెంచే ఆలోచన కేంద్రానికి లేదు.. పనికిరానోళ్ల మాటలను ప్రజలు నమ్మొద్దు

  • రాష్ట్రంలో సమృద్ధిగా పెట్రో నిల్వలు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • వదంతుల వల్లే ప్రజల్లో ఆందోళన

  • మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతుందన్న ప్రచారంలో వాస్తవంలేదని, ధరలు పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. దేశానికి అవసరమైన పెట్రోల్‌, డీజిల్‌లో 88 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ ధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తే.. ప్రభుత్వమే ప్రజలకు నేరుగా చెబుతుందని అన్నారు. ప్రతిపక్ష నేతలు, సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథిగృహంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. రాష్ట్రంలో 4,325 పెట్రోల్‌ బంకులుంటే... బుధవారం ఉదయం నాటికి 106 బంకుల్లో మాత్రమే నిల్వలు లేవని, వాటిలో కూడా నిల్వలను పునరుద్ధరించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగటం, ట్యాంకర్లు సర్దుబాటు చేయటం, ఇండెంట్లు ఆలస్యంగా పెట్టడం, ముందస్తు డబ్బుల చెల్లింపులు చేయాల్సి రావటంతో సరఫరాలో కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పారు.

ఇళ్లల్లో నిల్వచేసుకోవద్దు..

ఆంధ్రప్రదేశ్‌లో రెండు జిల్లాల్లో మొదలైన సమస్య తెలంగాణకు పాకిందని.. సోషల్‌ మీడియా ప్రచారం, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇళ్లలో డ్రమ్ములు, క్యాన్లలో పెట్రోల్‌, డీజిల్‌ను నిల్వచేసుకోవటం ప్రమాదకమని, వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. సాధారణంగా రాష్ట్రంలో రోజూ పెట్రోల్‌ డిమాండ్‌ 6,400 కిలోలీటర్లు ఉంటుందని, ఇప్పుడు 10,300 కిలో లీటర్లకు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో సాధారణ డిమాండ్‌ ఒక రోజుకు 3,200 కిలో లీటర్లు కాగా... ప్రస్తుతం 6,400 కిలో లీటర్లకు పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో డీజిల్‌ డిమాండ్‌ సాధారణ రోజుల్లో 8 వేల కిలోలీటర్లు ఉంటే... ఇప్పుడు 15,500 కిలోలీటర్లకు పెరిగిందని, హైదరాబాద్‌లో 2,700 కిలోలీటర్ల నుంచి 5,060 కిలోలీటర్లకు పెరిగిందని తెలిపారు. కొరత ఉందంటూ పనికిరానోళ్లు ప్రకటనలు చేస్తే ప్రజలు భయపడొద్దని కిషన్‌రెడ్డి సూచించారు. బల్క్‌ కొనుగోలుదారులకు సబ్సిడీ తగ్గించటంతో వారు కూడా సాధారణ బంకులకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. 5 కిలోల వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని.. హాస్టళ్లు, చిరు వ్యాపారులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్‌ దృష్టిపెట్టాలని కోరారు. 140 కోట్ల మంది టెన్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరే తీసుకుంటారని, ప్రజలు నిశ్చింతగా ఉండాలని కిషన్‌రెడ్డి కోరారు. ఏవైనా సమస్యలుంటే.. 70459 51163 నెంబరుకు ఫోన్‌చేసి చెప్పొచ్చని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


వదంతులు నమ్మొద్దు!: ఉత్తమ్‌

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని, ప్రజల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. సరఫరా మెరుగు పరచటంకోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామని, ఫిర్యాదులకోసం టోల్‌ ఫ్రీ నెంబరు- 1967 ఏర్పాటుచేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వదంతులతోనే ప్రజల్లో అనవసర ఆందోళన నెలకొందని చెప్పారు. రాష్ట్రంలో ఈ నెల 28 తేదీన ఒకేరోజు రికార్డు స్థాయిలో 3,817 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఒక్క రోజులో 36,404 కిలో లీటర్ల ఇంధన సరఫరా చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతలేదని స్పష్టంచేశారు.’

Updated Date - Apr 30 , 2026 | 04:42 AM