‘సర్’ అంటే భయమెందుకు?
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:52 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంటే మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎందుకు భయపడుతున్నాయి. ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై...
మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఈసీని విమర్శించడం విడ్డూరం: కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంటే మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎందుకు భయపడుతున్నాయి. ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి?’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, బయట రాష్ట్రాల ఉద్యోగులను తీసుకురాలేదని, అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఆదివారం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. పాతబస్తీలో అనేక దొంగ ఓట్లు ఉన్నాయని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు, రోహింగ్యాలు హైదరాబాద్‌లోని కొన్ని బస్తీల్లో నివసిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. దొంగ ఓట్ల నిర్మూలనకు ఎస్‌ఐఆర్ సరైన మార్గమని చెప్పారు. ఈ దేశ పౌరుడు కాని ఏ వ్యక్తీ ఓటర్ల జాబితాలో ఉండకూడదన్నారు. దేశం కోసం, హైదరాబాద్ రక్షణ కోసం సర్‌లో పాల్గొనాలని, బీజేపీ కార్యకర్తలు ఒక్క ఇల్లు కూడా వదలకుండా తిరగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటును హైదరాబాద్‌కు మార్చుకుంటే రేషన్ కార్డు, పెన్షన్ పోతాయని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఓటు హక్కుకు సంక్షేమ పథకాలతో సంబంధం లేదని చెప్పారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం గత పన్నెండేళ్లలో తెలంగాణ కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పులు చేస్తూ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలకు సున్నం కూడా వేయలేని పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ రాజకీయాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను, తెలంగాణను రక్షించాలంటే మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని, ఒక మేయర్ పదవి మజ్లి్‌సకు, ఒక మేయర్ పదవి కాంగ్రెస్‌కు అనే రాజకీయాలను ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మజ్లిస్ చేతుల్లో పడనివ్వకుండా కాపాడుకోవాలన్నారు. హైదరాబాద్‌లో పోలీసు అధికారుల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని, దారుస్సలాం నుంచి నిర్ణయాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.