నైనీ పెద్ద సమస్య కాదు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:51 AM
నైనీ బొగ్గు బ్లాకు అంశం పెద్ద సమస్య కాదని, దానిని పరిష్కరిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి నైనీ విషయంలో సింగరేణి ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పారు.
రాజకీయాలకతీతంగా సింగరేణి కోసం పని చేస్తాం
కార్మికుల రక్తం తాగుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్
కేసీఆర్ అవినీతి వల్లే జీతాలివ్వలేని దుస్థితి
ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగదు: కిషన్‌రెడ్డి
కొత్తగూడెం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నైనీ బొగ్గు బ్లాకు అంశం పెద్ద సమస్య కాదని, దానిని పరిష్కరిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి నైనీ విషయంలో సింగరేణి ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పారు. నైనీ టెండర్లకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కమిటీ వేయగా.. ఢిల్లీకి వెళ్లిన అనంతరం ఆ నివేదికను పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెం కోల్‌బెల్ట్‌లో పర్యటించారు. రుద్రంపూర్‌లోని పీవీకే-5 ఇంక్లైన్ గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు అతిథి గృహంలో కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన బీజేపీ మునిసిపల్ ఎన్నికల విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సింగరేణి కార్మికుల రక్తం తాగుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమంతా సింగరేణిని దోచుకుందని ఆరోపించారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితికి కేసీఆర్ అవినీతి పాలనే కారణమని విమర్శించారు. ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ వస్తే రూ.10 కోట్లు సింగరేణి నుంచి ఖర్చు పెట్టారని, ఫుట్‌బాల్‌కు సింగరేణికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సంస్థకు చెందిన రూ.51 కోట్లను ప్రభుత్వం వాడుకొని తిరిగి ఇవ్వకపోవడంతో సింగరేణి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణిలో ఖర్చు తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 35వేల మంది కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచడంతోపాటు, సింగరేణికి రావాల్సిన బకాయిల వసూళ్ల విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటు అంశంపై కిషన్‌రెడ్డితో చర్చించారు. కోల్ ఇండియా తరహా వేతన చట్టాన్ని అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడిక్కడ తెలంగాణను దోచుకున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. దోచుకున్నసొమ్మును పంచుకునేందుకు కొట్లాడుకుంటూ కేసీఆర్‌కుటుంబం రోడ్డున పడిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సైతం బీఆర్‌ఎస్ మాదిరిగా ఎక్కడపడితే అక్కడ దోచుకుంటోందని విమర్శించారు.