Share News

గనుల రంగంలో సంస్కరణల అమలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:27 AM

గనుల రంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2014లో బొగ్గు గనులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నామినేషన్‌ పద్ధతికి ముగింపు పలికి...

గనుల రంగంలో సంస్కరణల అమలు

  • పారదర్శకంగా వేలం విధానం తీసుకొచ్చాం

  • దేశ వ్యాప్తంగా క్రిటికల్‌ మినరల్స్‌కు డిమాండ్‌

  • ఉపకరణాల స్ర్కాప్‌ నుంచి రీసైక్లింగ్‌పై దృష్టి పెట్టాం

  • క్రిటికల్‌ మినరల్‌ బ్లాక్స్‌ వేలంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): గనుల రంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2014లో బొగ్గు గనులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నామినేషన్‌ పద్ధతికి ముగింపు పలికి, పూర్తిగా పారదర్శకమైన వేలం విధానాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించిన క్రిటికల్‌ మినరల్‌ బ్లాక్స్‌ 7వ విడత వేలంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గనుల రంగంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు సమాన అవకాశాలు కల్పిస్తూ పోటీ వాతావరణాన్ని సృష్టించేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రిటికల్‌ మినరల్స్‌కు డిమాండ్‌ పెరిగిందని, అందుకే పలు దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ‘క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌’ పేరుతో రూ.32వేల కోట్లు వెచ్చించి విదేశాల్లో ఉన్న క్రిటికల్‌ మినరల్స్‌ను భారత్‌కు తీసుకువస్తున్నామన్నారు. దేశంలో క్రిటికల్‌ మినరల్స్‌ వనరులు పరిమితంగానే ఉన్నా.. మోదీ ప్రభుత్వం గరిష్ఠంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అర్బన్‌ మైనింగ్‌పై దృష్టి సారించడంతోపాటు, ఎలక్ర్టానిక్‌, ఎలక్ట్రికల్‌ ఉపకరణాల స్ర్కాప్‌ నుంచి క్రిటికల్‌ మినరల్స్‌ను రీసైక్లింగ్‌ చేస్తున్నామన్నారు. అర్బన్‌ మైనింగ్‌ ద్వారా దేశానికి అవసరమైన క్రిటికల్‌ మినరల్స్‌లో 30-40 శాతం తిరిగి పొందే అవకాశముందన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని, వరుసగా రెండేళ్లుగా బిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేరుకున్నామన్నారు.

సీఎం రేవంత్‌కు అవగాహన లేదు

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ అంశాలపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయాల్లో సీఎం రేవంత్‌ కూడా అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు దేశంలోని మహిళల గౌరవాన్ని పెంచే చారిత్రక నిర్ణయమని, దాన్ని రాజకీయంగా చూడకూడదని హితవు పలికారు. ఇక, డీలిమిటేషన్‌ కారణంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనడం సరికాదన్నారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం డీలిమిటేషన్‌ జరగుతుందని, దీనికి రెండేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటారని, ఇందులో అపోహలు అవసరం లేదని అన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 05:27 AM