Share News

రుణాలను నేనెందుకు అడ్డుకుంటాను?

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:24 AM

హైదరాబాద్‌ మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల నుంచి తీసుకునే రుణాన్ని తానెందుకు అడ్డుకుంటానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

రుణాలను నేనెందుకు అడ్డుకుంటాను?

  • మెట్రో రెండో దశకు కేంద్రం రెడీ

  • 50శాతం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉంది

  • మొదటి దశ రుణ మంజూరీకి కృషి చేస్తా

  • నేను ఎవరిని కలిసినా రేవంత్‌ బాధ పడుతున్నారు

  • ‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల నుంచి తీసుకునే రుణాన్ని తానెందుకు అడ్డుకుంటానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హడ్కో, నాబార్డు వంటి సంస్థలు రుణాలిస్తున్నాయని, ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) కూడా అలాగే ఇస్తుందని అన్నారు. మెట్రో మొదటి దశ టేకోవర్‌ కోసం ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం మంజూరు కాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు ఐఆర్‌ఎఫ్‌సీ రుణానికి సంబంధించి ముఖ్యమంత్రి తొలిసారి రాష్ట్ర ప్రజలకు వివరాలు వెల్లడించారని వ్యాఖ్యానించారు. మెట్రో రెండోదశకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ‘ఆంధ్రజ్యోతి’తో కిషన్‌రెడ్డి చెప్పారు. 50 శాతం నిధులు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలపై అధ్యయనం జరుగుతోందని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అమలు చేసే నిబంధనలే తెలంగాణకూ అమలు చేస్తారన్నారు. ‘మెట్రో మొదటిదశ టేకోవర్‌ సందర్భంగా ఎల్‌అండ్‌టీకి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర సంస్థల నుంచి రుణం తీసుకుని ఇచ్చిందా? లేక భూములు అమ్మి ఇచ్చిందా?’ అన్న విషయం కూడా తెలియదు. ఓ పది ఎకరాలు విక్రయించడం, ఓ కార్యక్రమం చేయడం.. ఇదీ తెలంగాణలో నెలకొన్న దుస్థితి’ అని విమర్శించారు. మొదటి దశకు సంబంధించి రుణ మంజూరులో కేంద్రంలో ఏదైనా సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తాను ఎవరిని కలిసినా రేవంత్‌ బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఎప్పుడు ఏ మంత్రితో భేటీ అయ్యానో అధికారికంగానే ప్రకటిస్తున్నా. ఇందులో దాపరికం ఏముంది? నేను సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులను చూసే ఎవరెవరిని కలిశానో రేవంత్‌రెడ్డి చెబుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇటీవలే కొత్త డీపీఆర్‌..

మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త డీపీఆర్‌ అందజేసిందని, అందులోని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందో తెలుసుకుని సీఎం రేవంత్‌కు, రాష్ట్ర ప్రజలకు వెల్లడిస్తానన్నారు. ‘మేం తెలంగాణ కోసం ఉన్నాం. సీఎం రేవంత్‌ రెండున్నరేళ్ల నుంచి తెలంగాణ కోసం పనిచేస్తుంటే.. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎప్పటి నుంచో పనిచేస్తూ వస్తున్నా’అని అన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేశారు. కాగా,కిషన్‌రెడ్డి శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వేదపండితులు వారికి ఘన స్వాగతం పలికారు.

Updated Date - Jun 16 , 2026 | 05:24 AM