Share News

కేసీఆర్‌ను తొక్కుతానన్నావు కదాతొక్కి చూపించు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:34 AM

కేసీఆర్‌కు దత్త పుత్రుడినంటూ తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్‌ను తొక్కుతానన్నావు కదాతొక్కి చూపించు

  • కేంద్రం అడ్డం రాకుండా నేను చూసుకుంటా

  • హైకమాండ్‌ అనుమతివ్వలేదా? నీలో సత్తాలేదా?

  • జైల్లో పెట్టడం చేతకాక పోతే రాజీనామా చెయ్‌

  • సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌

  • నేనెవరికీ దత్తపుత్రుడిని కాదు

  • నా పేరు మార్చి పిలవడం రేవంత్‌ దిగజారుడుతనం

  • మజ్లిస్‌ పేరు చెబితే కాంగ్రెస్‌ ప్యాంట్లు తడుస్తాయ్‌

  • బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని ప్రజలు గ్రహించారు

  • మునిసిపోల్స్‌లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు

  • బీజేపీ అభ్యర్థుల కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు

  • విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌కు దత్త పుత్రుడినంటూ తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తానెవరికీ దత్తపుత్రుడను కాదని, తన తల్లితండ్రులు పెట్టిన పేరును మార్చే అధికారం ముఖ్యమంత్రికి లేదని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను చిప్పకూడు తినిపిస్తా, తొండలు వదులుతా, గుడ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకొని తిరుగుతా, పది కిలోమీటర్ల లోతు భూమిలోకి తొక్కుతా అని అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి అనేక సభల్లో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞలు చేశారని, దమ్ముంటే ఒక్కసారి తొక్కి చూపించాలని సవాలు విసిరారు. కేసీఆర్‌పై చర్యలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుమతి ఇవ్వలేదా? లే నీలో సత్తాలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో పెట్టాల్సిన బాధ్యత సీఎంగా రేవంత్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు. చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యత నెరవేర్చలేక కేంద్రం మీద నెపం వేసి చేతులు దులుపుకోవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘రేవంత్‌ తలచుకుంటే కేసీఆర్‌ను అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? కోర్టు అడ్డుకుందా? కేంద్రం అడ్డుకుందా? ఆయన ఎలా నాకు సవాల్‌ విసురుతున్నారు? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌పై దర్యాప్తులో కానీ, అరెస్టు చేసే ప్రక్రియలో కానీ కేంద్రం ఒక్క శాతం కూడా అడ్డం రాకుండా తాను చూస్తానని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేశాయని, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. రాహుల్‌, సోనియా, ప్రియాంకల్లో ఒక్కరు కూడా ఇంతవరకు కేసీఆర్‌ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రస్తావించారు. కేసీఆర్‌ను అరెస్టు చేయడం ద్వారా రేవంత్‌రెడ్డి ఆ రెండు కుటుంబాల మధ్య ఒప్పందాలు జరగలేదని నిరూపించాలని సవాల్‌ విసిరారు.


కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేక, ప్రజలకు జవాబు చెప్పలేక రేవంత్‌రెడ్డి తనను ఆడిపోసుకుంటున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డా? కిషన్‌రెడ్డా? అని ప్రశ్నించారు. రేవంత్‌ఖాన్‌ అని ముఖ్యమంత్రే గర్వంగా చెప్పుకున్నారని, పార్టీలు, జెండాలు, ఎజెండాలు మార్చడం ఆయనకు అలవాటేనని, నిన్న దయ్యం అన్నవాళ్లను నేడు దేవత అంటారని, ప్రధాని మోదీని ఒకరోజు ఆకాశానికి ఎత్తి మర్నాడు విమర్శించడం రేవంత్‌కు అలవాటేనని, మతం మార్చుకున్నా, రేవంత్‌ఖాన్‌ అని చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. తనకు తల్లితండ్రులు పెట్టిన పేరును, ఇంటి పేరును మార్చే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. రేవంత్‌పై తానెప్పుడూ వ్యక్తిగత దాడికి పాల్పడలేదని, ఆయన లాంటి దిగజారుడు రాజకీయాలు తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏమిచ్చారో చర్చిండానికి బీజేపీ సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి ప్రెస్‌క్లబ్‌లో చర్చ పెట్టాలని సవాల్‌ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ ప్రకటించలేదని, సీఎం రేవంత్‌ కలగన్నారేమోనని ఎద్దేవా చేశారు. డీపీఆర్‌ అనుమతి లేకుండానే రూ.27 వేల కోట్లు కేసీఆర్‌ సర్కార్‌ ఖర్చు పెట్టినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని, దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని గ్రహించి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. రేవంత్‌ మాటలు కోటలు దాటుతాయని, ఆయన ప్రకటించిన నిధులు మాత్రం మునిసిపాలిటీలకు రావని విమర్శించారు. మునిసిపల్‌ ఎన్నికలలో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుతుండటంతో రేవంత్‌రెడ్డి త్రిముఖ పోరు ఉందంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజానికి కాంగ్రె్‌స-బీజేపీల మధ్యే ముఖాముఖి పోటీ ఉందన్నారు. కాంగ్రెస్‌ మజ్లి్‌సతో కాపురం చేసినన్ని రోజులు తాము ఆ కాపురంలో నిప్పులు పోస్తూనే ఉంటామని చెప్పారు. మజ్లి్‌సకి వెయ్యి డివిజన్లలో ఉనికి ఉన్నా పోటీ చేయకుండా కాంగ్రె్‌సతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. రెడ్డి అయినా, రావు అయినా తమ దగ్గరకు రావాల్సిందేనని అక్బరుద్దీన్‌ ఒవైసీ అంటున్నారని, మజ్లిస్‌ పేరు చెబితే రెండు పార్టీలకు ప్యాంట్లు తడుస్తాయని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మక్తల్‌ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్యను కిషన్‌రెడ్డి ప్రస్తావిస్తూ పలు మునిసిపాలిటీల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్‌ బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. మక్తల్‌లో బీజేపీ గెలుస్తుందనే భయంతో కాంగ్రెస్‌ కుట్రలు పన్నిందని, మహా దేవప్పపై తీవ్ర ఒత్తిడి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అమ్మాయిలు పోటీ చేస్తే భర్తలను, యువకులు పోటీ చేస్తే తల్లిదండ్రులను ఎమ్మెల్యేలు పిలుపించుకుని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకుల ఒత్తిడి కారణంగానే చనిపోయాడంటూ మహదేవప్ప భార్య స్పష్టంగా ఫిర్యాదు చేసిందని ప్రస్తావించారు.

Updated Date - Feb 11 , 2026 | 02:34 AM