Share News

అంత దమ్ము, ధైర్యం నీకుందా?

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:32 AM

నేను తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటావా? తెలంగాణ పొలిమేర నుంచి నన్ను తరిమికొడతావా? అంత దమ్ము, దైర్యము నీకుందా? నీ కాంగ్రెస్‌ పార్టీకి ఉందా...

అంత దమ్ము, ధైర్యం నీకుందా?

  • తెలంగాణ పొలిమేర నుంచి నన్ను తరిమికొడతావా?

  • సీఎం రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌సిటీ/గోల్నాక, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘నేను తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటావా? తెలంగాణ పొలిమేర నుంచి నన్ను తరిమికొడతావా? అంత దమ్ము, దైర్యము నీకుందా? నీ కాంగ్రెస్‌ పార్టీకి ఉందా? మీ ప్రభుత్వానికి ఉందా?’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ‘నేను సవాల్‌ చేస్తున్నా.. నన్ను ఈ తెలంగాణ గడ్డ పొలిమేర నుంచి తరమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలేదు’ అని కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్‌పేట్‌ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రేవంత్‌ నన్ను తెలంగాణ నుంచి తరిమికొడతాడంట. నేను బీఆర్‌ఎస్‌ కార్యకర్తను కాను. కాంగ్రెస్‌ కార్యకర్తను కాను. చేతకాని రాహుల్‌గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్న వ్యక్తినీ కాదు. నేను భారతీయ జనతాపార్టీ కార్యకర్తను. నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నా. ఈ దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే వాళ్లే బీజేపీ కార్యకర్తలు’ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ పదేపదే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని అంటున్నాడని.. ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ‘మెట్రో మొదటి దశకు కేంద్రం రూ.1200 కోట్లు ఇచ్చినందుకా? రెండో దశకు మోదీ ప్రభుత్వం అంగీకరించినందుకా? 50 శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందుకా?.. దేనికి రాజీనామా చేయాలి?’ అని నిలదీశారు. ‘ఎన్నికల్లో హామీలిచ్చారు. గ్యారెంటీలు అన్నారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక ఊరూరూ తిరుగుతూ హామీ లిచ్చి గద్దెనెక్కారు. ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాటిని అమలు చేయకుండా రెండున్నరేళ్లుగా ప్రజలకు వెన్ను పోటు పొడుస్తున్నారు. దానికి ఎవరు బాధ్యత వహించి, రాజీనామా చేస్తారో చెప్పండి?’ అని సీఎంను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ మోసగించిందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు భారీగా నిధులు అందిస్తోందని, 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు.. తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. అంబర్‌పేట్‌ మహంకాళి ఆలయం ఎదుట ఫ్లైఓవర్‌ కింద రోడ్డు నిర్మాణం చేపడుతుంటే, కొంతమంది మజ్లిస్‌ నేతలు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కై అడ్డంకులు సృష్టించారన్నారు. ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉందని.. దీనిపై రేవంత్‌కు లేఖలు రాసినా పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 15 , 2026 | 04:32 AM