Share News

ప్రజల తీర్పును కాలరాయడమే: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:30 AM

దానం నాగేందర్‌, కడియం శ్రీహరివంటి ఫిరాయింపుదారులకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడం రాష్ట్ర ప్రజల తీర్పును కాలరాయడమేనని ....

ప్రజల తీర్పును కాలరాయడమే: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్‌, కడియం శ్రీహరివంటి ఫిరాయింపుదారులకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడం రాష్ట్ర ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్‌ సర్కారు అనుసరించిన తీరునే నేడు రేవంత్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం రేవంత్‌ సమక్షంలో కండువా మార్చుకుని కాంగ్రెస్‌ బీ-ఫాం మీద ఎంపీ అభ్యర్థిగా తనపై దానం నాగేందర్‌ పోటీ చేసిన సాక్ష్యాలు సరిపోవా? అని ఆయన స్పీకర్‌ను ప్రశ్నించారు. కాగా, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్‌ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక చీకటి రోజు అని అన్నారు. తన నివాసంలో మీడియాతో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఫిరాయింపులపై రెండేళ్లకుపైగా విచారణ పేరుతో సాగదీసి చివరకు వారికి స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు.

Updated Date - Mar 12 , 2026 | 05:30 AM