Share News

సైట్‌ విజిట్‌పై నిబంధన సరికాదు

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:01 AM

నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల విషయంలో సింగరేణి యాజమాన్యం విధించిన ‘సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌’ నిబంధనను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు.

సైట్‌ విజిట్‌పై నిబంధన సరికాదు

  • దేశంలో అనేక చోట్ల ఇది సెల్ఫ్‌ డిక్లరేషనే

  • ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్లలో సర్టిఫికేషన్‌ను సింగరేణి చేర్చింది

  • తద్వారా అవినీతికి బాటలు వేశారు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సీబీఐ దర్యాప్తు

  • సింగరేణితో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి

  • సంస్థ భూములూ దురాక్రమణ

  • మంత్రుల మధ్య వాటాలతోనే వివాదాలు బయటికి

  • కేంద్రానికి అప్పగిస్తే సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తాం

  • మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల విషయంలో సింగరేణి యాజమాన్యం విధించిన ‘సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌’ నిబంధనను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. టెండర్‌ దాఖలు చేసిన కంపెనీ ‘సైట్‌ విజిట్‌’ చేసినట్లు సంస్థ నుంచి సర్టిఫికెట్‌’ పొందాలన్న నిబంధన విధించాల్సిన అవసరం లేదన్నారు. ఈ నిబంధనను సింగరేణి యాజమాన్యం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేర్చిందని ఆరోపించారు. దేశంలో అనేక చోట్ల సైట్‌ విజిట్‌ చేయాలనే నిబంధన ఉందన్నారు. సైట్‌ విజిట్‌ చేస్తే సదరు కాంట్రాక్టర్‌కు ఖనిజ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై స్పష్టమైన అవగాహన వస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను పెట్టినట్లు చెప్పారు. ఇక సైట్‌ విజిట్‌పై సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందన్నారు. కానీ, సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ పొందడాన్ని తప్పనిసరి చేసి.. అవినీతికి బాటలు వేశాయని ధ్వజమెత్తారు. నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పదేళ్లపాటు కేసీఆర్‌ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ అవినీతి, అక్రమాలకు సింగరేణిని బంగారు బాతుగా వాడుకున్నాయని ఆరోపించారు. ఆ సంస్థను ఎన్నిరకాలుగా విధ్వంసం చేయవచ్చో అన్ని రకాలుగా బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణికి రూ.32 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆ బకాయిలు రూ.47 వేల కోట్లకు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు తమకు అప్పగిస్తే ఆ బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.


పదేళ్లు ఆ కుటుంబం మాటే చెల్లుబాటు

సింగరేణిలో పదేళ్లపాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మాటే చెల్లుబాటయిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. టెండర్ల దగ్గర్నుంచి.. చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్‌ కుటుంబం ఆడింది ఆట.. అన్నట్లుగా సాగిందన్నారు. రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టేశారని విమర్శించారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో రూ.684 కోట్ల అప్పుపై మారటోరియం విధించి సింగరేణిని కాపాడారని, తద్వారా ఆ సంస్థ లాభాల బాటలో నడిచిందని తెలిపారు. కానీ, 2014 తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చడంతో అది అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే దారిలో సాగుతోందని విమర్శించారు. సింగరేణి సంస్థకు నైనీ కోల్‌ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం 2015లో కేటాయించిందని, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి టెండర్లను ఆహ్వానించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అలాగే చేసిందని పేర్కొన్నారు. తాను బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. నైనీ కోల్‌ బ్లాక్‌కు సంబంధించిన అన్ని అనుమతులు వచ్చేలా చొరవ తీసుకున్నానని తెలిపారు. తన ప్రయత్నాల వల్ల 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. తుది అనుమతులు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేసిందని విమర్శించారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నా ఎటువంటి అధికారం ఉండదని తెలిపారు.


కేసీఆర్‌ హయాంలో కొందరికే లాభం..

కేసీఆర్‌ పాలనలో కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తాడిచర్ల కోల్‌ బ్లాక్‌ను జెన్‌కోకు కేటాయించామని, దానిని మైనింగ్‌ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే వారితో ‘మేం పని చేయలేం’ అని లేఖ రాయించుకుని ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్లపాటు టెండర్‌ కట్టబెట్టలేదా? అని నిలదీశారు. సింగరేణి లాగా దేశంలో ఏ కోల్‌ మైనింగ్‌ కంపెనీ కూడా ఇబ్బందులు ఎదుర్కొనడం లేదన్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి జీతాలిచ్చే పరిస్థితి నెలకొందని తెలిపారు. సింగరేణిలో జీ11 గ్రేడ్‌ బొగ్గు అమ్మకం ధర టన్నుకు రూ.4,088 కాగా, కోల్‌ ఇండియాలో.. ఇదే గ్రేడ్‌ బొగ్గు ధర టన్నుకు రూ.1,605 అని, దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నందునే.. సంస్థను నడిపేందుకు ధరలను పెంచడం తప్ప వారి వద్ద వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని విమర్శించారు. సింగరేణి బొగ్గు క్వాలిటీ 58 శాతం కాగా, కోల్‌ ఇండియాలో బొగ్గు క్వాలిటీ 86 శాతమని తెలిపారు. దీంతో సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడటంతో నాణ్యత, ధర విషయంలో తప్పటడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

ఆక్రమణకు గురవుతున్న భూములు..

అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడిపోయే పరిస్థితి నెలకొందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ హయాంలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు. అనేక పత్రికలు, చానళ్లలో సింగరేణి అక్రమాలపై చాలా కథనాలు వచ్చాయని, రాష్ట్రంలోని మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకొచ్చాయని అన్నారు. వీటిపై బోర్డు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలపైనా చర్చించడం లేదన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారు? వివిధ దశల్లో చెల్లిస్తారా? ఒకేసారి ఇస్తారా? అని ప్రశ్నించారు. సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్‌ పెట్టి ఈ అంశాలపే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. నైనీ కోల్‌ బ్లాక్‌ వ్యవహారం రాజకీయ పార్టీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, సింగరేణి భవిష్యత్తుకు, దానిపై ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విషయమని అన్నారు. సింగరేణి, నైనీ గనులపై తమ బొగ్గు శాఖ కార్యదర్శి విదేశీ పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తారని తెలిపారు.

Updated Date - Jan 22 , 2026 | 05:01 AM