సమర్థించండి.. లేదా నోరుమూసుకొని కూర్చోండి
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:16 AM
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కాంగ్రెస్ చేయలేని పనులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించొద్దు
నియోజకవర్గాల పునర్విభజనతో..దక్షిణాదికి అన్యాయం జరగదు
హైబ్రిడ్ నమూనా పేరుతో రేవంత్‌రెడ్డి
వితండవాదం.. మేధావితనానికి నిదర్శనం : కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కాంగ్రెస్ చేయలేని పనులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చేతనైతే సమర్థించాలని, లేదంటే నోర్మూసుకుని కూర్చోవాలని సూచించారు. అంతే తప్ప.. తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదారి పట్టించవదని హితవు పలికారు. ఢిల్లీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రాల వారీగా 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణాదికి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనడం వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఎంపీ సీట్లలో దక్షిణాదికి 24 శాతం సీట్లున్నాయని, సీట్ల సంఖ్య పెంచాక కూడా 24 శాతమే ఉంటాయని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వితండవాదం చేస్తున్నారని, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ నమూనా అనే కొత్త ఫార్ములా ఆయన మేధావితనానికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. 50 శాతం సీట్లు జనాభా ప్రతిపాదికన, మరో 50 శాతం ఎకనమిక్ ఇండెక్స్ ఆధారంగా ఇవ్వాలనే ప్రతిపాదన ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఎప్పుడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యం, చేయూతనిచ్చి ముందుకు తేవాలనుకుంటారని, కానీ.. సీఎం హోదాలో రేవంత్ చేసిన ప్రతిపాదనకు దేశమంతా ఆశ్చర్యపోతోందని అన్నారు. జీడీపీ వృద్ధి రేటు ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న రేవంత్‌రెడ్డి.. రేపు ఎమ్మెల్యే సీట్ల పెంపులోనూ ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లో సీట్లు తగ్గించి రంగారెడ్డి, హైదరాబాద్‌లో సీట్లు పెంచేలా నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
దక్షిణాదికి కీలక పదవులు ఇచ్చిన మోదీ..
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టమని ఇన్నాళ్లూ కాంగ్రెస్ వాదించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మోదీ సర్కారు నిర్ణయం తీసుకుందని చెప్పారు. తనకు, బండి సంజయ్‌కు భవిష్యత్తులో బంట్రోతు పని ఉంటుందని సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదని, కాంగ్రెస్ పార్టీయే తెలుగు ప్రజలను, తెలుగు నాయకులను బంట్రోతులుగా చూసిందని అన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రులను మార్చిందన్నారు. నాడు విమానాశ్రయంలో సీఎం అంజయ్యను రాజీవ్‌గాంధీ ఎలా అవమానించారో, టీడీపీ ఎందుకు పుట్టిందో రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ.. తెలుగు ప్రజలకు, దక్షిణాదికి కీలక పదవులు ఇచ్చారని తెలిపారు. దక్షిణాది నుంచి ఇద్దరికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారని, ఆర్థిక, రక్షణ, వాణిజ్య, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ వంటి ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. దక్షిణాదిన తమకు బలం లేకపోయినా.. ఈ ప్రాంతానికి చెందిన జైశంకర్, వెంకయ్యనాయుడిని వేరే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రులను చేశామన్నారు. కె.లక్ష్మణ్ వలసపోయారనే ముందు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కేరళకు ఎందుకు వచ్చారో, అభిషేక్ సింఘ్వీ తెలంగాణకు ఎందుకొచ్చారో రేవంత్ చెప్పాలన్నారు.