రాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరం
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:14 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి అధికారికంగా పాల్గొంటున్న కార్యక్రమాలకు స్వయంగా ముఖ్యమంత్రి లేదా ఆ రాష్ట్ర కీలక మంత్రులు పాల్గొనడం కనీస మర్యాద అని, కానీ.. మమత సర్కారు ఈ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని విమర్శించారు. సంతాలి తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఆ గిరిజన తెగ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం.. ప్రజాస్వామ్యాన్ని, గిరిజన జాతుల సాధికారతను నమ్మే వారందరి మనసులను కలచివేసిందని ఆయన తెలిపారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చి, రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ముర్ముకు జరిగిన ఈ అవమానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది దేశ చరిత్రలో అత్యంత దురదృష్టకర ఘటనల్లో ఒకటిగా నిలిచిపోతుందని కిషన్ రెడ్డి విమర్శించారు.