Share News

అబద్ధాలతో కాంగ్రెస్‌ మోసం

ABN , Publish Date - May 11 , 2026 | 05:48 AM

తెలంగాణ రాష్ట్రం పదేళ్లు ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అబద్ధాలతో కాంగ్రెస్‌ మోసం

  • రాష్ట్రంలో రాబోయేది బీజేపీనే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం పదేళ్లు ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ కుటుంబం అప్పులపాలు చేసిందని ఆరోపించారు. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్‌ అబద్ధాల గ్యారంటీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. అదే పార్టీ ఇప్పుడు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి హిందువులు ఓట్లు వేయలేదా? కాంగ్రెస్‌ పార్టీలో హిందువులు ఉండకూడదా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థికంగా దేశంలోనే శక్తిమంతంగా ఎదగడానికి మోదీ నాయకత్వంలోని కేంద్రం గత 11 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. సన్నబియ్యంలో 80 శాతం ఖర్చు కేంద్రం భరిస్తుంటే, 20 శాతం పెడుతున్న వాళ్లు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2400 కిలోమీటర్ల నేషనల్‌ హైవేలు ఉంటే.. గడిచిన పదకొండేళ్లలో 2600 కిలోమీటర్లు పెరిగాయని తెలిపారు. తాజాగా మరికొన్ని ఆ ఖాతాలో చేరుతున్నాయన్నారు. గతంలో ప్రధాని మోదీ రామగుండం ఫర్టిలైజర్స్‌, ఎన్టీపీసీ పనులు ప్రారంభించడానికి తెలంగాణకు వస్తే.. ఆనాటి సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్న కేంద్రం వివక్ష చూపించకుండా పనిచేస్తుందని, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు.

Updated Date - May 11 , 2026 | 05:49 AM