తెలంగాణను దోచుకుంటున్న కాంగ్రెస్
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:59 AM
తెలంగాణను పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ
ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసేలా పాలన
రెండు రాష్ట్రాలను అన్నదమ్ముల్లా అభివృద్ధి చేసుకోవాలి
అమరావతి అద్భుత రాజధానిగా అభివృద్ధి చెందాలి
లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న లక్ష్యం నెరవేరడంలేదని, ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసేలా కాంగ్రెస్ పాలన సాగుతోందని అన్నారు. బుధవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026పై చర్చ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పాటవుతున్న సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఆ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 1969లో జై తెలంగాణ అన్నందుకు 369 మంది ఉద్యమకారులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ 1200 మంది ఆత్మబలిదానం చేశారని పేర్కొన్నారు. వారి త్యాగంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యులు కొందరు తెలంగాణకు విమానాశ్రయాలు లేవని చెప్పారని, ఇందుకు కారణమెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు విమానాశ్రయాలు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలకు భూమి కోసం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్డీయే ప్రభుత్వం లేఖలు రాసినా.. భూమి ఇవ్వలేదని, కనీసం స్పందించలేదని తెలిపారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలను అన్నదమ్ముల్లా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని, తెలంగాణలోనూ అభివృద్థి పనులకు అండదండగా నిలుస్తోందని చెప్పారు.