Share News

ఫాతిమా క్యాంపస్‌‌పై మౌనమెందుకు?

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:43 AM

సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని...

ఫాతిమా క్యాంపస్‌‌పై మౌనమెందుకు?

  • మజ్లిస్‌ రక్షణకు వెనుకాడని కాంగ్రెస్‌ ప్రభుత్వం

  • సామాన్యుల కట్టడాలపైనే హైడ్రా కఠిన వైఖరి

  • పక్షపాత పాలనకు ఇదే ఉదాహరణ: కిషన్‌ రెడ్డి

  • రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తే ఫాతిమా విద్యా సంస్థలను కూల్చేస్తాం: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జులై 5 (ఆంధ్రజ్యోతి): సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాన్యుల కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తున్న హైడ్రా.. ఒవైసీ ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పులేదని కిషన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ‘భూములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోంది. అదే సమయంలో మజ్లిస్‌ పార్టీని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదు. రేవంత్‌ సర్కార్‌.. సెలక్టివ్‌ గవర్నెన్స్‌ (పక్షపాత పాలన)కు హైడ్రా ఓ ఉదాహరణ’ అని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం మజ్లిస్‌ పార్టీని యావత్‌ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇది పూర్తిగా తప్పు. హైడ్రా చర్యల వల్ల పేద ముస్లింల ఇళ్లు కూడా కూల్చివేశారు. వారి జీవనోపాధి దెబ్బతింటే మజ్లిస్‌ గానీ, కాంగ్రెస్‌ గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముస్లిం సమాజంపై కాంగ్రెస్‌ పార్టీకి ప్రేమలేదు.. తమ మిత్రుడైన ఒవైసీకి ఇబ్బంది కలగకూడదన్నట్లుగా, మజ్లిస్‌ ప్రయోజనాలకు కాపాడేలా.. రేవంత్‌ సర్కారు వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది’ అని ధ్వజమెత్తారు. ‘ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారం, కాంగ్రెస్‌ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలను, మజ్లిస్‌ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడం మానుకోవాలి. ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రాన్ని అమలుచేయాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


ఒవైసీకి ఓ న్యాయం... ఇతరులకు ఇంకో న్యాయమా?

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సల్కం చెరువును ఆక్రమించుకుని కట్టిన ఫాతిమా విద్యా సంస్థలను కూల్చివేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. ఆ సంస్థల్లోని విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ అండతోనే ఎంఎఐఎం అధినేత ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ మాట్లాడుతున్నారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదు అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదు? హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ‘చెరువును ఆక్రమించుకుని విద్యా సంస్థలను నిర్మించడమే తప్పు. గండిపేటలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులిస్తున్నారు. ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఒవైసీకి ఒక న్యాయం... ఇతరులకు ఇంకో న్యాయమా? ఒవైసీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్‌ ఇచ్చింది నిజం కాదా? విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా?’ అని సంజయ్‌ ఆదివారం ఓ ప్రకటనలో నిలదీశారు.

Updated Date - Jul 06 , 2026 | 03:43 AM