Share News

‘సర్‌’కు మతం రంగు పులుముతారా?

ABN , Publish Date - May 18 , 2026 | 03:25 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌ ) చేపట్టేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే.. వారిపైనా సీఎంకు నమ్మకం లేదు. వారికీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు.

‘సర్‌’కు మతం రంగు పులుముతారా?

  • ఉద్యోగులపై ఒక వర్గాన్ని రెచ్చగొడతారా?

  • హైదరాబాద్‌లో రోహింగ్యాల ఓట్లు తొలగించద్దా?: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): ‘‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌ ) చేపట్టేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే.. వారిపైనా సీఎంకు నమ్మకం లేదు. వారికీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. ఇటీవల ఓ ముస్లిం సమ్మేళనంలో పాల్గొన్న సీఎం... ముస్లింల ఓట్లు తొలగించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించడం సిగ్గుచేటు. సొంత ప్రభుత్వ అధికారులనే ఆయన అవమానించారు.. కించపరిచారు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలిసో తెలియకో కొంత మందికి రెండు, మూడు చోట్ల ఓట్లున్నాయని, వాటిని తొలగించడమే సర్‌ ఉద్దేశమని వివరించారు. సర్‌ ప్రక్రియ అమలులో ఎక్కడ కుట్ర జరిగిందో రేవంత్‌, కేటీఆర్‌ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న ప్రతీ రోహింగ్యా ఓటును వెతికి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీని సక్రమంగా అమలు చేయకపోవడంతో కొందరు రైతులను బ్యాంకులు డీఫాల్టర్లుగా చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఎందుకు కొనడం లేదంటే.. ఏ మంత్రీ సమాధానం చెప్పడం లేదన్నారు. కాగా, పెట్రోల్‌ ధరలు పెంచడం అప్రజాస్వామికం అంటున్న సీఎం రేవంత్‌.. వ్యాట్‌ తగ్గించి ప్రజలకు ఎందుకు ఉపశమనం కలిగించడం లేదని నిలదీశారు. కాగా, బండి భగీరథ్‌ ఇప్పటికే పోలీసులకు సరెండర్‌ అయ్యారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తున్నారని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Updated Date - May 18 , 2026 | 03:25 AM