బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలోనే సింగరేణికి నష్టాలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:30 AM
సింగరేణి ఉత్పత్తి, ఆదాయం పడిపోయాయని, ఈ పరిస్థితికి పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన కారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అవినీతితో నష్టాల్లోకి తెచ్చారు: రామచందర్‌రావు ఆరోపణ
కొత్తగూడెం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఉత్పత్తి, ఆదాయం పడిపోయాయని, ఈ పరిస్థితికి పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన కారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు సింగరేణికి రూ.25వేల కోట్ల అప్పు మిగిల్చిపోగా, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో రూ.26వేల కోట్లు అప్పు చేసిందన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో కలిసి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, మణుగూరు సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సింగరేణికి చేసిన మేలు, సాధించిన ఘనత ఏంటని ఆయన ప్రశ్నించారు. మెస్సితో ఫుట్‌బాల్ ఆడటానికి సింగరేణి నిధులను వాడుకోవాల్సిన అవసరమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ సింగరేణికి ఎలాంటి వేలంపాట లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా తాడిచర్ల-2 బ్లాకును కేటాయించారని ఆయన గుర్తు చేశారు.
ఆ రెండు పార్టీలు సింగరేణిపై శ్రద్ధ పెట్టలేదు: రామచందర్‌రావు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సింగరేణిపై శ్రద్ధ పెట్టకుండా సంస్థను నష్టాల్లోకి తెచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి ఆర్ధికంగా దివాళా తీయించారన్నారు. సింగరేణి నష్టాల్లో ఉండటానికి కారణం కమీషన్లకు కక్కుర్తి పడటం, అవినీతికి అలవాటు పడటమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పవార్, అందిజరెడ్డి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.