సింగరేణి నిబంధనలు మారుస్తాం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:26 AM
సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్ లేకపోతే జియో ట్యాగింగ్‌లో విజిట్ చేశాము అని రెండు రకాలుగా నిబంధనలు పెట్టొచ్చు. సింగరేణిలో కూడా తప్పకుండా నిబంధనలను మారుస్తాం.
సెల్ఫ్ డిక్లరేషన్ లేకపోతే.. జియో ట్యాగింగ్ చేసి చెప్పొచ్చు..ఏసీ రూముల్లో కూర్చుని టెండర్లు వేస్తే దేశం నష్టపోతుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కొత్తగూడెం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్ లేకపోతే జియో ట్యాగింగ్‌లో విజిట్ చేశాము అని రెండు రకాలుగా నిబంధనలు పెట్టొచ్చు. సింగరేణిలో కూడా తప్పకుండా నిబంధనలను మారుస్తాం. సంస్థలో నూతన సంస్కరణలు తీసుకురావాలి’’ అని కేంద్ర, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కోల్‌బెల్ట్ పర్యటనలో భాగంగా శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెం దు అతిథి గృహంలో ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సైట్ విజిట్ అనేది తప్పనిసరి అని, అది సింగరేణి యాజమాన్యం ఇవ్వాలన్నారు. కోల్ ఇండియాలో సైతం సైట్ విజిట్ అమల్లో ఉందని చెప్పారు. కొన్ని కంపెనీలు ఏసీ రూముల్లో కూర్చొని భూమి ఎక్కడ ఉంది..? అక్కడ అడవి, గుట్టలు, నదులు, వాగులు, రోడ్డు మార్గం, కరెంటు ఉన్నాయా..? వంటి అంశాలను చూడకుండా టెండర్లు వేస్తాయని, ఫలితంగా టెండర్ వచ్చిన తర్వాత పనులు ఆలస్యమైతే దేశం నష్టపోతుందన్నారు. మూడు, ఐదేళ్లలో చేయాల్సిన ఉత్పత్తిని పదేళ్లయినా చేయకపోవ డంవల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుంతోందన్నారు. సింగరేణి ఖర్చును ఏ రకంగా తగ్గించుకోవచ్చన్న అంశంపై ఆరు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం తరఫున కమిటీ వేసి, నివేదికను సింగరేణి యాజమాన్యానికి అందించామని పేర్కొన్నారు. ఆ నివేదికకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాల ను అధికారులు వెల్లడించారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు కలిసికట్టుగా సింగరేణిని రక్షించుకోవాలన్నారు. సింగరేణికి జెన్‌కో బకాయిలు చాలా ఉన్నాయని, దానిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. కోల్ ఇండియా, సింగరేణి లాభాలను కేంద్రప్రభుత్వం ఉపయోగించుకోవడంలేదని, వాటిని ఆ సంస్థల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నామన్నారు. సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా బొగ్గు నిక్షేపాలపై అన్వేషణ చేసి, నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. సింగరేణిలో నూతన ఉద్యోగుల భవిష్యత్ కోసం కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
జెన్‌కో నుంచి బాకీలు రాబట్టండి..
సింగరేణికి జెన్‌కోతో పాటు ఇతర పరిశ్రమలు, సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయాలని కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం సాయంత్రం ఆయన కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథి గృహంలో సింగరేణి అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జెన్‌కో నుంచి రావాల్సిన రూ.47 వేల కోట్లతో పాటు ఇతర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టేందుకు వన్ టైం సెటిల్‌మెంట్ లేదా రాయితీ ఇవ్వాలని కిషన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వానికి, బకాయిదారులకు మధ్య సమన్వయం కోసం డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించుకోవాలని చెప్పారు. సింగరేణిలో ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని, నిత్యం ఉత్పత్తి జరిగేలా రోటేషన్ పద్ధతిని పాటించాలని సూచించారు. కొత్త మైన్ల అనుమతుల్లో జాప్యంపై చర్చించిన ఆయన.. పర్యావరణ, ఇతర అనుమతుల విషయాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. టెండర్లలో, పనుల్లో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. రెండురోజుల పర్యటన కోసం శనివారం కొత్తగూడెంకు వచ్చిన కిషన్‌రెడ్డికి బీఎంఎస్, బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి అతిథి గృహంలో ఆయనను సీఎండీ కృష్ణ భాస్క ర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించిన కిషన్‌రెడ్డి.. సింగరేణి పరిధిలోని మైన్స్, డిపార్ట్‌మెంట్ల వద్ద ఏర్పాటు చేసే సమావేశాలపై చర్చించారు. అనంతరం ఓబీఆర్ కాంట్రాక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు.