Share News

ప్రధానిపై భౌతిక దాడికి రాహుల్‌ ప్రణాళిక

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:48 AM

రాహుల్‌ గాంధీ, అతని అనుచరులు లోక్‌సభలో ప్రధాని మోదీపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ప్రధానిపై భౌతిక దాడికి రాహుల్‌ ప్రణాళిక

  • కాంగ్రె్‌సను గూండాల పార్టీగా మార్చారు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ, అతని అనుచరులు లోక్‌సభలో ప్రధాని మోదీపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దాడి ప్రణాళికను అమలు చేయడానికి మహిళా ఎంపీలను ఒక ముసుగుగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రధానమంత్రి ముగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. కానీ, రాహుల్‌ సూచనల మేరకు ఎలాగైనా ప్రధానిని మాట్లాడకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌ సభ్యులు నిర్ణయించారని ఆరోపించారు. పవిత్రమైన పార్లమెంటు లోపల, బయట దేశాన్ని అప్రతిష్ఠపాల్జేయడంతోపాటు దేశ భద్రతపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు.. రాహుల్‌ నేతృత్వంలో ఆ పార్టీ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. భారత్‌ అభివృద్ధి చెందడం రాహుల్‌కిఇష్టం లేదని, దేశం ఒక పటిష్ఠమైన వ్యవస్థగా ఎదుగుతుండడాన్ని చూసి ఆయన ఓర్వలేకపోతున్నాడని ఆరోపించారు. దేశ ప్రజలు తనను నిరంతరం తిరస్కరిస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని రాహుల్‌.. కాంగ్రె్‌సను గూండాల పార్టీగా మార్చారని కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్‌తోపాటు అతని అనుచరులు సరిగ్గా పార్లమెంటు సమావేశాలకు ముందు కొన్ని బోగస్‌ వార్తలను సృష్టిస్తున్నారని విమర్శించారు. వారికి అనుకూలంగా ఉన్న పత్రికల్లో వాటిని ప్రచురింపజేస్తున్నారని ఆరోపించారు. ఆ బోగస్‌ వార్తలను చూపిస్తూ పార్లమెంటు సమావేశాలకు పదేపదే అంతరాయం కలిగిస్తున్నారని చెప్పారు. ఆయన అమలు చేస్తున్న నీచమైన ప్రణాళికను దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చైనా, పాకిస్థాన్‌ అజెండాలను రాహుల్‌ పదే పదే ప్రచారం చేస్తున్నారని, దేశ భద్రత విషయంలో కాంగ్రెస్‌ రాజీ పడిన విషయం అందరికీ అర్థమవుతోందని చెప్పారు.

Updated Date - Feb 06 , 2026 | 03:48 AM