Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎంకు కుడి, ఎడమ భుజాలు: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:17 AM

ఎంఐఎంకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుడి, ఎడమ భుజాలని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అండతో ఎంఐఎం పార్టీ అక్రమాలకు...

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎంకు కుడి, ఎడమ భుజాలు: కిషన్‌రెడ్డి

  • రాష్ట్రంలో వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే: రాంచందర్‌రావు

బర్కత్‌పుర, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎంకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుడి, ఎడమ భుజాలని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అండతో ఎంఐఎం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉంటున్నవారు సొంత ఊరిలో కాకుండా ఇక్కడే ఓటరుగా పేరు నమోదు చేయించుకుని తమ ఓటు హక్కు కాపాడుకోవాలని సూచించారు. ఆదివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ సెంట్రల్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అండతో రజాకార్ల పాలన తేవడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లను రద్దు చేయడానికి నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ నెల 26న కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రాబోతోందని, గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లపై కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని, జీహెచ్‌ఎంసీలో ఎంఐఎంను గెలిపించడానికి కుట్రలు చేస్తున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.

Updated Date - Jul 20 , 2026 | 03:18 AM