దేశానికి క్యాపిటలిజం, కమ్యూనిజం పనికిరావు
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:53 AM
ప్రపంచంలో కొన్ని దేశాలు క్యాపిటలిజం వైపు, మరికొన్ని కమ్యూనిజం వైపు నడుస్తూ గొడవపడుతున్నాయి. ప్రపంచానికి తమ సిద్ధాంతాలే అవసరమని వారిద్దరూ పేర్కొంటున్నారు.
ఏకాత్మతా మానవతా వాదంతోనే అభివృద్ధి: కిషన్‌రెడ్డి
విజయవాడ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచంలో కొన్ని దేశాలు క్యాపిటలిజం వైపు, మరికొన్ని కమ్యూనిజం వైపు నడుస్తూ గొడవపడుతున్నాయి. ప్రపంచానికి తమ సిద్ధాంతాలే అవసరమని వారిద్దరూ పేర్కొంటున్నారు. కమ్యూనిజం, క్యాపిటలిజం భావజాలాలు భారతదేశ ఆలోచనలు, సాంస్కృతిక, సాంప్రదాయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి. ఈ విషయం ఏకాత్మతా మానవతా వాదం వచ్చాక తెలుసుకున్నాం’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జనసంఘ్ 12వ మహాసభ ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘క్యాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయంగా భారత ఆలోచనా విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా దీన్ దయాళ్ ఏకాత్మతా మానవతావాదం అందించారు. కమ్యూనిస్టు చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛలేదు. క్యాపిటలిజంలో వ్యక్తిగత స్వేచ్ఛ అపరిమితంగా ఉంటుంది. రెండూ సమానంగా ముందుకెళ్లాలంటే ఏకాత్మతా మానవతావాదం అవసరం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.