Share News

ముస్లింలకు 14శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్‌ యత్నం

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:45 AM

ముస్లింలకు 14శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌ తీవ్రంగా యత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు...

ముస్లింలకు 14శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్‌ యత్నం

  • ముస్లింలను అక్రమంగా బీసీల్లోకి జొప్పించే కుట్ర

  • కాంగ్రెస్‌ తీరుతో అర్హులైన బీసీలకు నష్టం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ముస్లింలకు 14శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్‌ తీవ్రంగా యత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మత ప్రాతిపదికన 4ు రిజర్వేషన్లు కల్పించి, అదనంగా 10ు జోడించి ముస్లింలను బీసీ వర్గాలలోకి అక్రమంగా చొప్పించడానికి కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందన్నారు. దీనివల్ల నిజంగా అర్హులైన బీసీలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు, సామాజిక న్యాయ ద్రోహానికి, బీసీలు ఓట్లతోనే సమాధానం చెబుతారని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన 4శాతం ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే పొంది, రిజర్వేషన్లు అమలు చేస్తోందని విమర్శించారు. బీసీలు, ముస్లింలకు కలిపి స్థానిక సంస్థల్లో 42ు రిజర్వేషన్లను కేటాయించారని, కోర్టు కనుక ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయకపోతే, బీసీ సమాజం తీవ్రంగా నష్టపోయేదని చెప్పారు. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 150 సీట్లలో 50 సీట్లను బీసీలకు రిజర్వ్‌ చేస్తే బీసీయేతర అభ్యర్థులు 31 సీట్లను గెలుచుకున్నారని, బీసీలకు కేటాయించిన సీట్లలో 62శాతం సీట్లు ఎంఐఎం గెలిచిందన్నారు. బీసీల సాధికారత కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు ఈ విధంగా పక్కదారి పట్టినప్పుడు, నిజమైన బీసీలకు న్యాయం ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్‌ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్‌ ముస్లింలకు 4ు రిజర్వేషన్లపై మాట్లాడుతుంటే బీజేపీ మతపరమైన రిజర్వేషన్లంటూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయని, ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:45 AM