కాంగ్రెస్‌ది చరిత్రాత్మక తప్పిదం
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:54 AM
రాజకీయపరమైన ఆక్రోశం, అహంకారం, స్వార్థం, కక్షతోనే.. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
అహంకారంతో మహిళలకు తీరని ద్రోహం
ఉమ్మడి రాష్ట్రంలోగానీ, తెలంగాణలోగానీ బీసీని సీఎంను చేసిందా?: కిషన్‌రెడ్డి
మహిళలు రాజకీయాల్లోకి రావడం వారికిష్టం లేదు: రాంచందర్‌రావు
న్యూఢిల్లీ/హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రాజకీయపరమైన ఆక్రోశం, అహంకారం, స్వార్థం, కక్షతోనే.. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, దేశ మహిళలకు తీరని ద్రోహం, నష్టం చేసిందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన చరిత్రాత్మక తప్పిదమని మండిపడ్డారు. ప్రధాని మోదీపై, బీజేపీపై ఉన్న ద్వేషాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశంలోని మహిళల మీద, దక్షిణాది మీద చూపించాయని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరి సహకారం ఉంటుందనే ఆకాంక్షతో మహిళా రిజర్వేషన్ల అమలుకు బిల్లును ప్రవేశపెడితే.. కాంగ్రెస్, మిత్రపక్షాలు కుట్ర చేసి అడ్డుకున్నాయని విమర్శించారు. జనగణన పూర్తయితే చాలా సమస్యలు వస్తాయని, దక్షిణాదికి న్యాయం జరగాలన్న తపనతో మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు. కానీ, తెలంగాణకు జరిగే మేలును రేవంత్‌రెడ్డి, కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ‘‘బీజేపీకి మహిళను అధ్యక్షురాలిని చేశారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఏనాడైనా ఓ మహిళను ముఖ్యమంత్రిని చేశారా? స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడైనా బీసీని ఉమ్మడి ఏపీకి, తెలంగాణకు ముఖ్యమంత్రిని చేశారా?’’ అని ప్రశ్నించారు.
ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బానిస..
కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబానికి బానిసలా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. ‘‘సోనియా, రాహుల్, ప్రియాంకల ఆధిపత్యమే కొనసాగాలన్నది కాంగ్రెస్ నేతల మనస్తత్వం. సాధారణ మహిళలు రాజకీయాల్లోకి రావడం వారికి ఇష్టం లేదు’’ అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. బీజేపీ మహిళా మోర్చా, యువమోర్చా నాయకులు దశల వారీగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు చేరుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాంచందర్‌రావును ఉదయం నుంచే గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని, నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. కాగా, నారీశక్తికి కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయేలా చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర: లక్ష్మణ్
చట్టసభల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెరగకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని బీజేపీ ఎంపీలక్ష్మణ్ ఆరోపించారు. దేశ జనాభాకు అనుగుణంగా పునర్విభజన చేపట్టి, సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మరింత మంది అట్టడుగు వర్గాలకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం పాత పద్థతిలోనే సీట్లు ఉండాలని మొండికేయడమేమిటని ప్రశ్నించారు. జీఎస్‌డీపీ ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ మాటలను పార్లమెంటులో ఒక్క కాంగ్రెస్ సభ్యుడూ సమర్థించకపోవడం హాస్యాస్పదమన్నారు. మహిళల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలే బుద్థి చెబుతారని హెచ్చరించారు.