Share News

డిపాజిట్లు, పెట్టుబడుల పేరిట మోసం

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:55 AM

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీములు, భూమి పెట్టుబడి పథకాల పేరిట డిపాజిట్లు సేకరించి గడువు ముగిసిన తర్వాత అసలు, వడ్డీ చెల్లించకుండా మోసం చేశారనే ఆరోపణలపై ‘కిసాన్‌ పరివార్‌ లిమిటెడ్‌’ సంస్థపై..

డిపాజిట్లు, పెట్టుబడుల పేరిట మోసం

  • రూ.48.46 లక్షల వసూళ్లు

  • రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ కుటుంబానికి టోకరా

  • ‘కిసాన్‌ పరివార్‌ లిమిటెడ్‌’ సంస్థపై ఈవోడబ్ల్యూలో కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీములు, భూమి పెట్టుబడి పథకాల పేరిట డిపాజిట్లు సేకరించి గడువు ముగిసిన తర్వాత అసలు, వడ్డీ చెల్లించకుండా మోసం చేశారనే ఆరోపణలపై ‘కిసాన్‌ పరివార్‌ లిమిటెడ్‌’ సంస్థపై సైబరాబాద్‌ ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌(ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమో దు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. సికింద్రాబాద్‌ హస్మత్‌పేట్‌కు చెందిన భారత వైమానిక దళం రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ నున్నా రమేష్‌ కుమార్‌ కుటుంబసభ్యులు కిసాన్‌ పరివార్‌ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన హామీలను నమ్మి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, భూమి పెట్టుబడి పథకాల్లో రూ.48.46 లక్షలు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పూర్తిగా సురక్షితమని, నిర్ణీత కాలానికి అధికవడ్డీతో పాటు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఆయన భార్య నున్నా నిరూపకుమార్‌ వివిధ బ్యాంకుల ద్వారా రూ.32.46 లక్షలు, కుమారుడు నున్నా రాజ్‌కుమార్‌ మరో రూ.16 లక్షలు మొత్తం రూ.48,46,300 ఆ సంస్థకుచెల్లించారు. ప్రారంభంలో కొంతకాలం వడ్డీ చెల్లించిన సంస్థ ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు నిలిపివేసి, మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అసలు మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. పలువురు పెట్టుబడిదారులను ఇదే తరహాలో భారీ మొత్తాలను సేకరించి, వారిని కూడా మోసగించినట్లు అనంతరం తెలిసిందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై తొలుత బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఘటన గచ్చిబౌలి పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో జరగడంతో కేసు అక్కడికి బదిలీ చేశారు. అనంతరం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌కు బదిలీ చేయగా, పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Aug 05 , 2026 | 05:56 AM